‘ముంపు’ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలి
భద్రాచలం రూరల్, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాల్లోని ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తెలంగాణలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ మెడికల్ ఆండ్ హెల్త్ ట్రైబల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కారం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూని యన్ జిల్లా రెండవ మహాసభ ఆదివారం పట్టణంలోని రెడ్‌క్రాస్ భవనంలో జరిగాయి. యూనియన్ పేరును ‘తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ట్రైబల్ ఎంప్లాయిస్ యూనియన్’గా మారుస్తూ తీర్మానాన్ని ఈ మహాసభ ఆమోదించింది.
ఈ మహాసభలో నాయకులు మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్ఎన్ల ఖాళీలను వెంటనే స్థానిక గిరిజన ఎంపీహెచ్(ఫిమేల్)తో భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండవ ఎంపీహెచ్ఏ(ఫిమేల్)లకు ప్రతి సబ్ సెంటర్‌ను రెండవ సబ్ సెంటర్‌గా చేస్తూ అక్కడే పనిచేస్తున్న రెండవ ఎంపీహెచ్ఏ(ఫిమేల్)లను రెగ్యులర్ చేయాలని, ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని ఆరువేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా సంఘటితంగా ఉండాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
యూనియన్ జిల్లా నూతన కమిటీని ఈ సమావేశం ఎన్నుకుంది. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎవి.రమణకుమారి, వాసం నర్సింహారావు, 20మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులుగా వీసాల ఉమాదేవి, పూనెం సత్యవతి, 20 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సోమరాజు దొర, జోనల్ కార్యదర్శి గొంది వెంకటేశ్వర్లు, కాంతమ్మ, ఎవి.రమణకుమారి, వీరాస్వామి, కృష్ణయ్య, చిన్నమ్మా యి, చుక్కమ్మ, తుర్రం రామకృష్ణ, దూలయ్య, ఇందిర, జమున, సుమలత పాల్గొన్నారు.