బీమా తప్పు దిద్దండిలా..!
దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెం ట్ సాధనాల్లో ముందుండేది బీమా. ఈ పథకాల కాలపరిమితి ఐదేళ్ళ నుంచి 20, 30 అంతకంటే ఎక్కువ ఏళ్లు కూడా ఉంటాయి. ఇలాంటి దీర్ఘకాలిక పథకాలను తీసుకున్నప్పుడు అనేక సందర్భాల్లో కంపెనీని సంప్రదించాల్సి రావచ్చు. చిరునామా మారినప్పుడు లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్లో మార్పులు చేసుకున్న సందర్భాల్లో బీమా కంపెనీని సంప్రదించాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఆన్లైన్ ద్వారా పాలసీదారుల సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం నేరుగా వెళ్ళక తప్పదు. పాలసీదారులు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు, ఆ సమయంలో అనుసరించాల్సిన విధానాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
పాలసీ డాక్యుమెంట్ రాకపోతే: ప్రపోజల్ ఫారమ్‌పై సంతకం చేసి మొదటి ప్రీమియం చెల్లిస్తే పాలసీ డాక్యుమెంట్ చేతికి రావడానికి కనీసం రెండు నుంచి నాలుగు వారాలు పడుతుంది. నెల దాటినప్పటికీ పాలసీ రాకపోతే ఒకసారి బీమా కంపెనీని సంప్రదించి ఆలస్యానికి గల కారణాలు తెలుసుకోండి. చాలా సందర్భాల్లో ఆలస్యం కావడానికి పాలసీ డాక్యుమెంట్ ఇతరుల చిరునామాకి వెళ్లి ప్రధాన కార్యాలయానికి తిరిగి రావడం.... లేదా కొరియర్ సంస్థ మీ చిరునామాను కనిపెట్టలేకపోవడం వంటి సందర్భాల్లో జాప్యం అవుతున్నాయి. ఏదైనా క్లెయిమ్‌కు దాఖలు చేయాలంటే పాలసీ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలన్న విషయం మర్చిపోవద్దు. అందుకే పాలసీ డాక్యుమెంట్ రావడం ఆలస్యమైతే తప్పకుండా కంపెనీని సంప్రదించాలి. లక్ష్యానికి సరిపోకపోతే: పాలసీ డాక్యుమెంట్ చేతికి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఒకసారి పరిశీలించండి.
ముఖ్యంగా అది మీ లక్ష్యానికి సరిపోతుందా లేదా, పాలసీ తీసుకునే ముందు ఏజెంట్ చెప్పినదాంట్లో ఏమైనా తేడాలు వచ్చాయా అని చూడండి. పాలసీ మీ లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపించినా లేక ఏజెంట్ మాటలతో మోసం చేసినట్లు అనిపించినా పాలసీని వెనక్కి ఇచ్చేయచ్చు. దీనికి బీమా కంపెనీలు ఎలాంటి చార్జీలు వసూలు చేయవు. చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తాయి. పాలసీ డాక్యుమెంట్ చేతికి వచ్చిన 15 రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.తప్పులు దొర్లితే: పాలసీ డాక్యుమెంట్ ముద్రణలో అచ్చుతప్పులు రావడం చాలా సహజం. చిరునామా, పేర్లు, పుట్టిన తేదీ వంటి విషయాల్లో ఇలా తప్పులు దొర్లుతాయి. ఇలాంటి తప్పులను వెంటనే పరిష్కరించుకోవాలి. లేకపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏజెంట్ ద్వారా కాకుండా స్వయంగా ప్రపోజల్ ఫారమ్‌ను పూర్తి చేయడం ద్వారా సాధ్యమైనంత వరకు ఇలాంటి తప్పుల నుంచి బయటపడొచ్చు.
క్లెయిమ్ విషయంలో: జీవిత బీమాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం ఏదైనా ఉందంటే అది క్లెయిమ్ మాత్రమే. అన్ని కాగితాలు, పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా క్లెయిమ్‌లో ఆలస్యం జరిగితే వెంటనే ఆ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇవి కాకుండా రెన్యువల్ విషయంలో, యూలిప్ పథకాల్లో ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కి మారే సందర్భాల్లోనూ సమస్యలొస్తుంటాయి ఇలాంటి సందర్భాల్లో కూడా కంపెనీని సంప్రదించడం ద్వారా వీటిని పరిష్కరించుకోవచ్చు.ఇలా చేయండి: పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి బీమా కంపెనీలు అనేక పరిష్కార మార్గాలను అందిస్తున్నాయి. ఆ సమస్యను నేరుగా కంపెనీ దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు ఇతర అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి.
టోల్ -ఫ్రీ నంబర్: ఇప్పుడు ప్రతీ బీమా కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఇస్తున్నాయి. ఏదైనా సమస్య వస్తే ఈ నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. దీనికి ఎటువంటి చార్జీలు పడవు. కాని ఇలా ఫోన్ చేసే ముందుగా మీ పాలసీ నంబర్ దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు సోషల్ నెట్వర్క్ సైట్స్ ఫేస్బుక్, ట్విట్టర్‌తో కూడా సమస్యలను కంపెనీ దృష్టికి తీసుకెళ్ళచ్చు.చివరగా ఐఆర్డీఏ: మీ సమస్యను కంపెనీ దృష్టికి తీసుకెళ్ళినా... దాన్ని పరిష్కరించకపోతే నేరుగా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏకి చెందిన అంబుడ్స్‌మన్ లేదా గ్రీవెన్స్ సెల్ దృష్టికి తీసుకెళ్ళండి.