గడ్డం అడ్డం కాదు...!
కొన్నాళ్ల కిందట...
ఇంగ్లాండ్‌లోని బెర్క్‌షైర్‌లో నివసించే హర్నామ్కౌర్(23)కు పాలీలిస్టిక్ ఓవరీ సిండ్రో మ్ కారణంగా11 ఏళ్ల నుంచే శరీరమంతా వెం ట్రుకలు రావడం మొదలైంది... అప్పటి నుంచి ఆమెకు కష్టాలు కూడా మొదలయ్యాయి. ఆడపిల్ల అందునా అంత చిన్న వయసులో గడ్డం, మీసాలు రావడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక హర్నామ్ బాధ వర్ణనాతీతం. స్కూల్లో అందరూ ఆమెను ‘ఫీమెన్’ అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నెట్లో ఫొటోలు పెడితే కొందరు చంపేస్తామంటూ హెచ్చరించారు. ప్రతిరోజూ శరీరమంతా ట్రిమ్ చేసుకోవడం ఆమెకు కష్టంగా మారింది. ఇవన్నీ భరించలేక ఇంట్లోంచి బయటకు రావడమే మానేసింది. ఒక దశలో ఆత్మహత్యచేసుకోడానికి కూడా ప్రయత్నించింది.
ఇప్పుడు....
ప్రతికూలతనే అనుకూలంగా మార్చుకుంది...తన జీవితానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని ఇక ఎంతమాత్రం తొలగించకూడదని నిర్ణయించుకుంది. ఇంట్లో వాళ్లు వారించినా సిక్కు మత సంప్రదాయం ప్రకారం ట్రిమ్ చేయడం మానేసింది. గడ్డం, మీసాలతోనే బయట ప్రపంచంలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. ఈ విషయంలో తన సోదరుడు గురుదీప్‌సింగ్ ఎంతో సహాయం చేశాడని, అడుగడుగునా ప్రోత్సహించాడని హర్నా మ్ తెలిపింది. ‘దేవుడే నన్ను ఇలా తయారు చేసినప్పుడు నేనెందుకు బాధపడాలి.. ఇలా ఉన్నందుకు సంతోషంగానే ఉన్నా.. నిజం చెప్పాలంటే ఇప్పుడే అమ్మాయిలా ఉన్నాననిపిస్తుంది.. అందరికీ నేను చెప్పేదొక్కటే.. మీ శక్తి ఏంటో మీరు గ్రహించండి.. మీకు ఇష్టమైనట్లే మీరు ఉండాలి.. మీ జీవితం మీదే..’ అంటున్న హర్నామ్ ప్రస్తుతం ఇంగ్లాడ్‌లోని ఒక సిక్కు ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు గడ్డంతో ఉన్న తన వీడియోలను యూట్యూబ్‌లో పెట్టి తనలా బాధపడే మహిళకు స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నిస్తోంది.