Pollock Movie: ’పొలాక్ ’మూవీ సమీక్ష
జాక్సన్ పోలాక్ అనే ఒక లేదా ఒకే ఒక గొప్ప చిత్రకారుడు అనగనగా ఉండేవాడు. ’పొలాక్ ’ అనే పేరు మీదే తనపై తీసిన ఒక సినిమా ఉంది. ఆ పోలాక్ సినిమా చూశాకా ఇప్పుడు నేను వ్రాయాల్సింది పోలాక్ గురించా? ఎడ్ హరిస్ గురించా లేదా లీ క్రాన్సర్ పాత్ర ధరించిన మార్సియా గే హాడ్సన్ గురించా అని సమస్య నాది.
సినిమా ప్రారంభ దృశ్యం పొలాక్ పెయింటింగ్ షో తో మొదలవుతుంది. పెద్దమనుషులు, సూటుబూట్లవాళ్ళు, దేవతల వంటి భూమ్మీది అందగత్తెల నడుమ ఎడ్ హారిస్ అనే గొప్ప సినిమా స్టార్ ఆబ్ స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిస్ట్ పోలాక్ గా నిలబడి ఉన్నాడు, మడత నలగని నల్లరంగు సూట్లో ఠీవిగా ఐవరీ బ్లాక్ రంగులా ఉన్నాడు. తన మీది నుంచి కెమెరా పాన్ అవుతుంది. ఆగాగు, ఉండుండు, ఇదేమిటి!! అనుకుని సినిమా పాజ్ చేసి మళ్ళీ ఆ సీన్ కొసం కొన్ని సెకండ్లవెనక్కి వెళ్ళి చూశా. నిజమే మడత నలగని బట్టల్లో నిమ్మ పండులా నిగనిగలాడుతున్న పోలాక్ బ్రొటన వ్రేలు, చూపుడు వేలు మధ్య భాగపు చర్మం నలుపులో ఉంది, సబ్బేసి తొమీ తోమీ కాస్త వెలిసిన నలుపులో ఉంది. ఒక పెయింటర్ అదీనూ పొలాక్ లాంటి వాడి పెయింట్ మరకలు నిండిన చేయి ఎలా ఉండాలో అలానే ఉందది.
(చదవండి: ఆ సినిమా చూడు రూ.82000 గెలుచుకో.. కానీ ఓ ట్విస్ట్)
మీరెప్పుడయినా పెయింటర్ల వైపు వారి చేతులవైపు పరీక్షగా చూశారా" పెళ్ళిల్లలో, పండుగ వేడుకల్లో కలిసినప్పుడయినా పర్లా. కొత్త బట్టలు ధరించి ధవళ సుభ్రంగా తళతల లాడిపోతున్నా సరే వారి చేతులవంక చూడండి ఆ చేతి చివరలలో కానీ , గులాబీ గోర్లపై కానీ పెయింట్ మరకలు లేకపోతే, ఇండియన్ ఇంక్ చుక్కలు మిగలకపోతే వాడేం చిత్రకారుడు. కంప్యూటర్ మానీటర్ మీదనో, వాకం పలక మీదనో బొమ్మ జారిపోయేవాడయ్ మాత్రమే ఉంటాడు కాక.
మరిప్పుడు నేను వ్రాయాల్సింది పోలాక్ గురించా? ఎడ్ హరిస్ గురించా లేదా లీ క్రాన్సర్ పాత్ర ధరించిన మార్సియా గే హాడ్సన్ గురించా? ఈ ముగ్గురితో పాటు ఈ సినిమా దర్శకుడి గురించా? అని ఆ ఎడ్ హరిస్ చేతి డిటైల్ ని షూట్ చేసిన దర్శకుడి దగ్గరకి వెళ్ళి దండం పెట్టుకుందామని చూస్తే ఈ సినిమా దర్శకుడు కూడా ఎడ్ హరిస్. ఇది దర్శకుడిగా తన తొలి సినిమా. దీన్నే తెలుగులో టూమచ్ లేదా థర్టీ టూమచ్ అనంటాను.
హారీస్ ఏంచేశాడంటే పోలాక్ పాత్రలో ఒదిగి పోవటానికి, జాక్సన్ పొలాక్ జీవితం పై, అతని బొమ్మలపై ఇంతవరకు అచ్చయిన ప్రతి పుస్తకాన్ని అక్షరమక్షరం చదివాడు, పోలాక్ ఒరిజినల్ బొమ్మ వున్న ప్రతి గ్యాలరి కి వెళ్ళి బొమ్మని ఆమూలాగ్రము పట్టి పట్టి పరిశీలించాడు. ఈ చూపు ఆ తీక్షణత వృధా కాలేదు. హారిస్ ఈ సినిమాలో ప్రతి కేన్వాస్ పెయింటింగ్ సీన్ లో తన చేతి వేల్లకు చిత్రకారుడి నటన అబ్బించాడు, ఆ వేళ్ళు నిజ్జంగా పరిణితి చేందిన చిత్రకారుడి వలె పని చేశాయి.
అవి పెయింట్ ట్యూబ్ ని పిండిన పద్దతి, కేన్వాస్ పై ప్లాట్ బ్రష్ తో లాగిన స్ట్రొక్స్, విదిలించిన చిక్కని నల్లని రంగు తీగల విన్యాసం చూస్తే ఎడ్ హారిస్ ఒక దర్శకుడి కన్నా, నటుడిగా కన్నా చిత్రకారుడిగా ఎక్కువ పని చూపించాడని, నిజమైన చిత్రకారులు కూడా ఇతగాడి వేళ్ల ఈజ్ ని, అడుగులు రిథంని అందుకోడం అసాద్యం.
ఇంకా గుంటూరు కారం ఘాటు వంటి కేమెల్ సిగరెట్ల పెట్టెలు ఊదేయడం కూడా అలవాటు చేసుకున్నాడు, పోలాక్ బ్రాండ్ అదే మరి. సన్నగా కండలు తిరిగి సంపూర్ణ సౌష్టవంతొ ఉన్న తన శరీరానికి చెడ తినడం మప్పించి చివరి రోజుల్లో పొలాక్కు ఉన్నటువంటి పెద్ద పొట్ట, నిండయిన బుగ్గలు తెచ్చుకున్నాడు( మీకెమైనా రేజింగ్ బుల్ సినిమాలో రాబర్ట్ డెనిరో, ది మెషినిస్ట్ లో క్రిస్టియన్ బేల్ గుర్తుకు వస్తున్నాడా? వెరీ గుడ్) ఈ సినిమాలో పొలాక్ బాగా తాగీ సైకిల్ మీద బీర్ క్యాన్లు తెచ్చే సన్నివేశం ఒకటి ఉంది ఆ సీన్లో తను కింద పడిపోవాలి, ఇక్కడా సహజంగా పడిపొవడమే నటించాడు . షాట్ బ్రహ్మాండంగా కుదిరింది. చేయి చీరుకుపోయి హారిస్ కి మిగిలింది అయిదు కుట్ల సువేనీర్ కూడా.
పోలాక్ గురించి వెనుక చెప్పుకునే ఒక కథ ఉంది. తనకు నచ్చని ఆర్ట్ డీలర్ గాడికి బొమ్మ అమ్మాల్సి వస్తే ముందుగా ఆ పెయింటింగ్ మీద ఉచ్చ పోసి. ఆరబెట్టి ఆ తరువాతే పంపేవాడట. ఇది ఏ మాత్రం అబద్ధం కాకూడదని నేను సర్వాదా దేవుణ్ణి వేడుకుంటా. అలాగే ఒక విజయోత్సవ సంబరంలో ఆ పార్టీ మధ్యలో ధనము, కనకము, రియల్ ఎస్టేట్ వ్యాపారమూ, కీర్తి కిరీటము , ప్రతిష్టా సింహాసనము, కనాజియర్ వేషము, రాజకీయము, చిత్రకళా విమర్శ, సంగీతము, సాహిత్యము, ఇదీ అదీ అనేదేమిటి! ఎలైట్ గ్రూప్ అని పిలవబడే ప్రతి ఒక్క నా పుత్రుడు మరియో అతగాడు కట్టుకున్న పెళ్లాలందరి ముందు నిటారుగా నిలబడి జిప్పు సర్రుమని క్రిందికి లాగి వారు చలి కాచుకుంటున్న పైర్ ప్లేస్ లో ఉచ్చపోసి " యు నో హూ ఈస్ ది బాస్" అన్నటూ క్వచ్చన్ మార్క్ మోహం పెడతా డు.
చచ్చు రూపాయినోటు అచ్చు ముందు కేన్వాస్ బొమ్మ గొప్పతనాన్ని నిస్సహాయంగా అంగీకరించుకుంటూ ఆ జనం కూడా ఏడవలేక నవ్వుతారు, నీ ధారకు జేజేలు అన్నట్టు అబ్బుర కూడా పడతారు జేబులో అణాకాణి చిల్లర మిగులు లేని పోలాక్ పొగరు అది, తన జీవితకాలంలో ఏ ఒక్కపెయింటింగ్ని కనీసం పదివేల డాలర్లకు అమ్ముకోలేని అచ్చమైన చిత్రకారుడికి వున్న అత్యంత అధిక మిగులు అహంకారమది . మీకూ నాకూ ఉంటుందా? బహుశా మనమూ ఆర్టిస్ట్ లమైనపుడో, అలా బ్రతకగలిగినపుడో మాత్రమే మన తల కామందు ముందు కాక, వాడు పడేసే చిల్లర నోట్ల ముందు కాకా పొలాక్ లా ఇలా తల వంచి కాన్వాస్ చూడగలిగినపుడు మాత్రమే కళాకారుడు తలెత్తుకుని ఉండగలడు. (పొలాక్ మూవీ డిసెంబర్ 15, 2000లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్లో అద్దెకు లభిస్తోంది)
-అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి