బాల్యం ‘ఊపిరి’కి కాలుష్యం తూట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్కూలుకు వెళుతున్న చిన్నారుల్లో దాదాపు 35 శాతం మందికి ఊపిరితిత్తులు మొరాయిస్తున్నాయి. ఎదిగే వయసులో ఉన్న బాలల లేత ఊపిరితిత్తులకు నాణ్యత లేని గాలి వల్ల తూట్లు పడుతున్నాయి. అంతిమంగా నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం బాల్యం ఊపిరి తీస్తోంది! ముఖ్యంగా ప్రధాన నగరాల్లో పరిస్థితి మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 8-14 ఏళ్ల మధ్య ఉన్న 2 వేల మంది స్కూలు విద్యార్థులపై నిర్వహించిన ‘బ్రీత్ బ్లూ-15’ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
సర్వేలో తేలిన ముఖ్యాంశాలు...
{బీత్ బ్లూ సర్వేలో భాగంగా.. 2 వేల మంది బాలలకు ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్ష(లంగ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్ట్-ఎల్‌హెచ్‌ఎస్‌టీ) నిర్వహించగా, ఏకంగా 35 శాతం మంది ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం లేదని తేలింది.
ఇక వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 21 శాతం మంది విద్యార్థుల ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువగా(పూర్‌గా), మరో 19 శాతం మంది ఊపిరితిత్తుల పనితీరు అథమస్థాయిలో(బ్యాడ్‌గా) ఉంది. మొత్తంగా 40 శాతం మంది చిన్నారుల శ్వాస అవయవాలు సాధారణ స్థాయిలో పనిచేయడం లేదు.
వాయుకాలుష్యంపై ప్రజల అవగాహనను తెలుసుకునేందుకు ‘క్లీన్ ఎయిర్ ఇండియా మూవ్మెంట్’ సంస్థ నిర్వహించిన ‘పౌరుల అవగాహన-దక్పథం సర్వే’ ప్రకారం.. వాయు కాలుష్యాన్ని నివారించే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, తాము చేయాల్సిందేమీ లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.
వాయు కాలుష్యానికి ప్రజలు కూడా బాధ్యులేనని ఢిల్లీలో 15 శాతం, ముంబైలో 24 శాతం, బెంగళూరులో 27 శాతం, కోల్‌కతాలో 9 శాతం మంది మాత్రమే అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా ద్విచక్ర వాహనదారులు 46 శాతం, నాన్ ఏసీ కారు ఓనర్లు 63 శాతం, ఏసీ కారు ఓనర్లు 96 శాతం మంది వాహనాలు ఎక్కువసేపు నిలిపినప్పుడు నిర్లక్ష్యంతో ఇంజిన్ ఆపివేయడంలేదు.
పరీక్షించిన అంశాలు ఇవే...
ఊపిరితిత్తులు ఎంత గాలిని పీల్చుకుంటున్నాయి? బయటికి, లోపలికి గాలి ఎంత వేగంగా వెళ్తోంది? ఎంత ఆక్సిజన్‌ను పీల్చుకుని, ఎంత కార్బన్ డయాక్సైడ్ను వదులుతున్నాయి? ఊపిరితిత్తులకు ఇతర సమస్యలు, జబ్బులు వచ్చాయా? వంటి అంశాలను ఎల్హెచ్ఎస్టీలో పరీక్షించారు. ఇందులో ప్రతికూల ఫలితాలు వస్తే.. భవిష్యత్తులో తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.