విష్ణు ప్రీతి
మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికరమైన మాసం. సహస్రనామాలు, పూజలు, పాశురాలు... ఆ ఆధ్యాత్మిక వైభవమే వేరు అమ్మాయిలు బద్దకాన్ని అటకెక్కించి చలిని లెక్క చేయకుండా ముచ్చటగా ముగ్గులు వేస్తుంటే... హరిదాసులు ముంగిటలో నిలబడి హరిలో రంగ హరీ ఆలపిస్తుంటే... వంట గదిలో బామ్మలు, అమ్మమ్మలు ఘుమఘుమలాడే రకరకాల ప్రసాదాలు తయారు చేస్తుంటే... ఆ ఆనందం వేరు. మరో నెలరోజులలో సంక్రాంతి. ఇవన్నీ టీజర్లు... ఫస్ట్ లుక్‌లు... ఆ వైకుంఠునికి ప్రణమిల్లి ప్రసాదం సమర్పించి పెద్ద పండగకు సిద్ధమవుదాం పదండి.
చక్ర పొంగలి
కావలసినవి బియ్యం - గ్లాసు, పాలు - 2 గ్లాసులు, పెసర పప్పు - అర గ్లాసు, బెల్లం తురుము - కప్పున్నర, పచ్చి కొబ్బరి ముక్కలు - కప్పు, జీడిపప్పు - 10, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
తయారీ బియ్యం, పెసరపప్పులను విడివిడిగా వేయించాలి ఒక పాత్రలో వేయించిన బియ్యం, పెసర పప్పులకు, మూడు గ్లాసుల నీళ్లు, పాలు జత చేసి ఉడికించాలి బెల్లం తురుము జత చేసి బాగా చిక్కబడే వరకు ఉడికించాలి బాణలిలో నెయ్యి కరిగాక, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసేసి, పొంగలిలో వేసి కలపాలి. (తగినంత నెయ్యి వేస్తేనే చక్కెర పొంగలి రుచిగా ఉంటుంది)
బెంగళూరు పులిహోర
కావలసినవి: చింతపండు - నిమ్మకాయంత, పసుపు - అర టీ స్పూను, బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత
పొడి కోసం: నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు - అర కప్పు, ఎండు మిర్చి - 10, ఇంగువ - అర టీ స్పూను, మిరియాలు - అర కప్పు, జీలకర్ర - అర కప్పు, మెంతులు - అరకప్పు, ఆవాలు - పావు కప్పు.
పులిహోర అన్నం కోసం: బాస్మతి బియ్యం - కప్పు, చింతపండు గుజ్జు -4 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత.
గార్నిషింగ్ కోసం: నువ్వుల నూనె - 6 టేబుల్ స్పూన్లు, ఆవాలు - టీ స్పూన్లు
డ్రై గార్నిష్ కోసం: నువ్వులు - అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు.
ఫ్రైడ్ గార్నిషింగ్ కోసం: నువ్వుల నూనె - 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు - టీ స్పూన్లు, సెనగ పప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టేబుల్ స్పూను, ఇంగువ - అర టీ స్పూను, పల్లీలు - పావుకప్పు, కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ: చింతపండును కప్పు నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి కరిగాక మసాలా దినుసులను విడివిడిగా వేయించి, విడివిడిగా పొడులు చేసి పక్కన ఉంచాలి బాణలిలో 6 టేబుల్ స్పూన్ల నువ్వులనూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాక, చింతపండు రసం, ఉప్పు, పసుపు, బెల్లం పొడి వేసి బాగా కలిపి, మిశ్రమం చిక్కపడేవరకు కలపాలి
తయారుచేసి ఉంచుకున్న పొడులు వేసి మరోమారు కలపాలి బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి బియ్యం ఉడికించి, ఒక పళ్లెంలో అన్నం విడివిడిలాడేలా పరిచి చల్లార్చాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలపాలి బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, గార్నిషింగ్ కోసం తీసుకున్న వస్తువులు (కరివేపాకు తప్ప) వేసి వేయించాలి పల్లీలు బాగా వేగాక దింపేసి, కరివేపాకు, చింతపండు గుజ్జు జత చేసి, పులిహోరలో వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.
ఆవ దద్ధ్యోదనం
కావలసినవి: బియ్యం - అర కప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, పెరుగు - కప్పు, పాలు - పావు కప్పు (కాచి చల్లార్చాలి), ఆవాలు - టీ స్పూను (కొద్దిగా నీళ్లు జత చేసి పది నిమిషాలు నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేయాలి), ఆవాలు - అర టీ స్పూను, సెనగ పప్పు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, పచ్చి మిర్చి - 3, ఎండు మిర్చి - 3, కరివేపాకు - 2 రెమ్మలు, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టీ స్పూన్లు
తయారీ: బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి విజిల్ తీశాక, అన్నాన్ని మెత్తగా అయ్యేలా గరిటెతో మెదిపి బాగా చల్లారాక పాలు జత చేసి మరోమారు కలపాలి పెరుగు, ఆవాల ముద్ద, ఉప్పు జత చేసి గరిటెతో బాగా కలపాలి బాణలిలో నూనె కాగాక, ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న అన్నంలో వేసి బాగా కలపాలి సుమారు అరగంట తర్వాత అల్లం పచ్చడితే సర్వ్ చేయాలి.
నేతి పులిహోర
కావలసినవి: బియ్యం - 2 కప్పులు (మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి), చింతపండు రసం - 3 టేబుల్ స్పూన్లు (చిక్కగా ఉండాలి)
పసుపు - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, నువ్వులు - టేబుల్ స్పూను, ఎండు మిర్చి - 4 (ముక్కలు చేయాలి), మినప్పప్పు - టీ స్పూను, సెనగ పప్పు - టీ స్పూను, పల్లీలు - గుప్పెడు, జీడిపప్పు - 10 గ్రా., ఇంగువ - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, కరివేపాకు - 3 రెమ్మలు, నెయ్యి - 10 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక మెంతులు, ఎండు మిర్చి, నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి కాగాక ఇంగువ, ఆవాలు, కరివేపాకు, మినప్పప్పు, సెనగ పప్పు, పచ్చి మిర్చి వేసి వేయించాలి చింతపండు పులుసు, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి ఉడికించాలి బాగా ఉడికిన తర్వాత నువ్వుల పొడి జత చేసి మిశ్రమమంతా ముద్దలా అయ్యేవరకు సుమారు రెండు నిమిషాలు ఉడికించాలి పెద్ద పాత్రలో అన్నం వేసి పొడిపొడిలాడేలా పరిచి, చల్లారాక, ఉడికించి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి వేయించిన పల్లీలు జత చేసి మరోమారు కలిపి సుమారు గంటసేపయ్యాక తింటే రుచిగా ఉంటుంది.
కట్ పొంగల్
కావలసినవి: బియ్యం - కప్పు, పెసర పప్పు - కప్పు, నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - 25 గ్రా., మిరియాల పొడి - 2 టీ స్పూన్లు
తయారీ: బియ్యం, పెసరపప్పులను శుభ్రంగా కడిగి, ఆరు కప్పుల నీరు జత చేసి కుకర్‌లో నాలుగు విజిల్ వచ్చేవరకు ఉంచి దించేయాలి విజిల్, తీసి ఉడికిన అన్నానికి తగినంత ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు గరిటెతో మెదిపి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి కాగాక, మిరియాల పొడి వేసి దోరగా వేయించాలి జీడి పప్పులు జత చేసి దోరగా వేయించి తీసేసి, పొంగల్‌లో వేసి బాగా కలపాలి. (నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తే పొంగల్ రుచిగా ఉంటుంది)