జిల్లాల విభజన శాస్త్రీయంగా చేపట్టాలి
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
కరీంనగర్ : జిల్లాల విభజన శాస్త్రీయంగా చేపట్టాలని, రెవెన్యూ డివిజన్ మండలాల విభజ నలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఉందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. హుజూరాబాద్, హుస్నాబాద్లను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించినప్పటికీ కొన్ని కారణాలతో ఈ అంశం మరుగునపడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూతురు ఎంపీ కవిత ఆర్మూర్లో రెవెన్యూ డివిజన్ను ప్రారంభించుకున్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.
పక్క జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకుంటున్నారని గతంలోనే ప్రతిపాదించిన హుజూరాబాద్, హుస్నాబాద్ల కోసం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అర్బన్, రూరల్ రెవెన్యూ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విభజన చేపట్టాలని కోరారు. నూతనంగా ఏర్పాటు చేసే మండలాలు కూడా ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అశాస్త్రీయంగా విభజన చేపడితే ప్రజాయుద్ధం తప్పదని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.