పేద ముస్లింలకు యోగి వరం
తన కాషాయ దుస్తులను బట్టి తనను కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందినవాడిగా అంచనా వేయొద్దని, తన పనులు చూసి అప్పుడు చెప్పాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన తొలినాళ్లలోనే చెప్పారు. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు మైనారిటీల సంక్షేమం మీద దృష్టిపెట్టారు. పేద ముస్లిం కుటుంబాలు తమ కుమార్తెల పెళ్లిళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. దాంతోపాటు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. ముస్లింలకు సామూహిక వివాహాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
సద్భావన మండపాలు
ఉత్తరప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సామూహిక వివాహాలు జరిపించేందుకు వీలుగా ’సద్భావనా మండపాలు’ నిర్మించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తే.. ప్రతియేటా రెండుసార్లు చొప్పున ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. ప్రధానంగా పేద ముస్లిం కుటుంబాల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ. 20వేల సాయం అందిస్తోంది. అయితే, ఈ పథకంలో అవినీతి ఎక్కువగా ఉందని, ముస్లిం కుటుంబాలకు ఇది అందడం లేదని ఆరోపణలున్నాయి.
యోగి మదిలో ఆలోచనే
పరిస్థితులను నిశితంగా గమనించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ సామూహిక వివాహాల ప్రతిపాదనను తీసుకొచ్చారని మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మొహిసిన్ రజా చెప్పారు. సద్భావన మండపాలు పేద ముస్లిం కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.