పల్లెకు సుస్తీ
– గ్రామాల్లో కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల కొరత
– పంచాయతీల్లో పెరుగుతున్న సమస్యలు
– నిధుల వినియోగంలో స్వలాభాపేక్ష
– రోగాలకు నిలయాలుగా మారిన పల్లెలు
పల్లెటూళ్లు పట్టణాలకు పట్టుకొమ్మలు. కాని ఆ పల్లెటూళ్ల ఆలనా.. పాలన చూడాల్సిన దిక్కులేక మురికి కూపాలుగా మారిపోయాయి.ఏ చిన్న సమస్య ఎదురైనా ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంతో ప్రజలు అలసి పోవడం మినహా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు.
అనంతపురం సిటీ : జిల్లాలో ఉన్న 1003 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం 542 క్లస్టర్లుగా విభజించింది. వీటిని కూడా గ్రేడ్–1 నుంచి గ్రేడ్ 4గా నాలుగు విధాలుగా స్థాయి కల్పించింది. ఈ లెక్కన 542 క్లస్టర్లకు 542 మంది గ్రామ కార్యదర్శులు ఉండాలి. కాని 480 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 62 స్థానాలు ఖాళీగా నిలిచి పోయాయి. ఏళ్ల తరబడి ఈ స్థానాలను భర్తీ చేయక పోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఆస్తి పన్ను వసూళ్లు చేయడానికి ఆయా గ్రామాల్లో కార్యదర్శులు లేక పోవడంతో పదుల సంవత్సరాలుగా పన్ను చెల్లింపులు జరగలేదు. ఫలితంగా పంచాయతీల ఆదాయానికి భారీ గండి∙పడింది.
పారిశుద్ధ్యం పట్టేదెవరికీ..?
గ్రామ పంచాయతీల్లో తాగునీరు తర్వాత పారిశుద్ధ్యమే ప్రధాన అంశం. పంచాయతీల ఆదాయంలో 30 శాతం శానిటేషన్ పనులకు వెచ్చించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు దీనికి చివరి ప్రాధన్యతను ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 10 సంవత్సరాలకు పైగా చాలా పంచాయతీల్లో కార్యదర్శులు లేరు. శానిటేషన్ సిబ్బంది నియామకాలు ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఇటీవల కాంట్రాక్టు కార్మికులను రోజువారి వేతనం చొప్పున నియమించుకునే అవకాశం కల్పించినా నిబంధనల మేరకు ఇబ్బందులు అదేస్థాయిలో ఉన్నాయి. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకోలేకపోతున్నారు. ఇన్ని సమస్యల మధ్య గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం ఎండమావే అవుతుంది.
వృథా ఖర్చులే ఎక్కువ
జిల్లాలో ఎక్కువ ఆదాయం వస్తున్న సుమారు 26 పంచాయతీల్లో కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. మైనర్ పంచాయతీల్లో సిబ్బంది ఊసే లేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఉన్న పంచాయతీ కార్యదర్శుల్లో కూడా చాలా మంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీల్లో పాలకవర్గాలు ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. 2013–14 సంవత్సరానికి గాను ప్రభుత్వం 13వ∙ఆర్థిక సంఘం ని«ధులు రూ. 15.71 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమీషన్ ద్వారా రూ 5.17 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా 14వ ఆర్థికS సంఘం నిధులు కూడా రూ. 53 కోట్లు విడుదలై మరో రెండు రోజుల్లో ఖాతాలకు చేరనున్నాయి. గతంలో వచ్చిన నిధులు చాలా వరకు వథాగా ఖర్చు చేసినట్లు సీజినల్ వ్యాధుల తీవ్రతే స్పష్టం చేస్తోంది. ప్రస్తుత నిధులైనా సక్రమంగా గ్రామాల అభివద్ధికి వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకుని పాలక వర్గాలకు మార్గదర్శకాలివ్వాలని పలువురు కోరుతున్నారు.