అటకెక్కిన కంప్యూటర్ విద్య
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. నిరుపేదల విద్యార్థులకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఇంగ్లిష్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కంప్యూటర్ బోధనలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం 2008లో సర్కార్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 236 పాఠశాలల్లో మొత్తం 2,596 కంప్యూటర్లను కొనుగోలు చేశారు.ఆయా పాఠశాలల్లో 7,8,9వ తరగతి చదివే విద్యార్థులకు బోధనలు అందించేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఇతర పరికరాలతో పాటు కాంట్రాక్ట్ పద్ధతిన ప్రత్యేక టీచర్లను కూడా నియమించారు.
ప్రతి పాఠశాలలో ఇద్దరు కంప్యూటర్ టీచర్లను నియమించి ప్రభుత్వం వారికి నెలకు రూ.2,500 చొప్పున వేతనాన్ని కూడా చెల్లించింది. అయితే 2008లో ప్రారంభించిన కంప్యూటర్ విద్య పథకం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియడంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్ టీచర్లను అధికారులు అర్ధంతరంగా తొలగించారు. దీంతో ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. కాగా విద్యార్థుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన కంప్యూటర్ బోధనను నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కంప్యూటర్ టీచర్లను కొనసాగించాలి
జిల్లాలోని సక్సెస్ స్కూళ్లలో పనిచేసే కంప్యూటర్ టీచర్లను యథావిధిగా కొనసాగించి, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కంప్యూటర్ టీచర్ల సంఘం సభ్యులు కోరుతున్నారు. గత ఐదేళ్లుగా పాఠశాలల్లో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం అర్ధంతరంగా తొలగించడం బాధాకారమని వారుపేర్కొంటున్నారు.
ఉపాధ్యాయులే బోధిస్తారు: డీఈఓ
ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్య ఆపేదిలేదని, ప్రస్తుతానికి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులే కంప్యూటర్ విద్యను బోధిస్తారని డీఈఓ ఎం.సోమిరెడ్డి పేర్కొన్నారు.గతంలో బోధించిన వారిని మాత్రం తీసుకునే ప్రసక్తేలేదు.ప్రభుత్వం మళ్లీ కాంట్రాక్టు పద్ధతిలోనే కొత్తవారికి అవకాశం కల్పిస్తుంది.