శిల్పకళా సోయగాలు
ఉత్తరప్రదేశ్ కళాకారులు చేసిన పింగాణీ పాత్రలు, ఒరిస్సా కళాకారులు శాండ్ స్టోన్‌తో చేసిన శిల్పాలు, ఉడ్‌కార్వింగ్ వస్తువులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్ శిల్పారామంలో హస్తకళా మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో కొలువుదీరిన వస్తువులు కళాకారుల పనితనానికి అద్దం పడుతున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్న ఈ మేళాలో రోజూ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేస్తున్నాయి. ఉదయం 10.30 నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వీటితోపాటు హ్యండ్లూమ్, జూట్, హ్యండీ క్రాఫ్ట్, ఉడ్ కార్వింగ్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, షాల్స్, ఎంబ్రాయిుడరీ, కార్పెట్లు, టైట, బ్లూ పోటరీ తదితర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు సందర్శకుల కోసం పదమూడు ఫుడ్‌కోర్టులు అందుబాటులో ఉన్నాయి.
- మాదాపూర్
అలరించిన జానపద నృత్యాలు
మాదాపూర్ శిల్పారామంలో అఖిల భారత హస్తకళా మేళా సందర్భంగా ఏర్పాటు చేసినసాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కార్యక్రమాలలో భాగంగా బుధవారం నగరానికి చెందిన మల్లంపల్లి రాజు బృందం జానపద గీతాలతో సందర్శకులను అలరించింది. ఇందులో గల్గల్ చప్పుళ్ల గాజులు... తంగేడు చెట్టుకింద... లాంటి పల్లెటూరి వాతావరణంలో పాడుకునే పాటలు, బావామరదల సరసాల పాటలను పాడి అలరించారు. కళాకారులు రమేష్, నరేష్, యాదయ్య, రేణుక, అశోక్‌లు పాల్గొన్నారు. వీరికి సంగీత సహకారాన్ని డప్పు సురేష్, ప్యాడ్స్ స్వామి, నృత్యం రజిత అందించారు. లింగంపల్లికి చెందిన గిరీశ్చంద్ర, దేవి, కుమారి బిగినా బాలకృష్ణన్‌ల బృందం కూచిపూడి నృత్యప్రదర్శన సందర్శకులను అలరించింది. ఇందులో గణేశ్, కీర్తన, తరంగం, ఆనందతాండవం, మోహినియట్టంలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
పింగాణీ పాత్రలు అద్భుతం...
ఉత్తరప్రదేశ్‌కి చెందిన కళాకారులు తయారు చేసిన పింగాణీ పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. సహజసిద్ధమైన రంగులను వాడి ఆకర్షణగా పాత్రలను తయారు చేస్తున్నారు. వీటిలో వంట సామగ్రి, టీ కప్పులు, బాత్రూమ్ సెట్, గృహాలంకరణ వస్తువులు, డిన్నర్ సెట్లు అందుబాటులో ఉంచారు. వీటి ధరలు రూ. 25 నుంచి రూ.6500 వరకు పలుకుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ కార్వింగ్ వస్తువులు...
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళాకారులు చేసిన కార్వింగ్ వస్తువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.గృహాలంకరణకు ఉపయోగించే వస్తువులు, వంట సామగ్రి వీటిలో ఉన్నాయి. వీటితోపాటు కార్వింగ్ చేసిన సోఫా సెట్లు, కుండలు తదితర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 30 నుంచి రూ.8 వేల వరకు
పలుకుతోంది.
కరీంనగర్ చిత్రకారుడి ప్రతిభ...
కరీంనగర్‌కి చెందిన చిత్రకారుడు రమేష్ వేసిన పల్లె అందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రదర్శనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకృతి అందాలను కంటికి కట్టినట్లుగా వేసిన తైలవర్ణ చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుంటున్నాయి. వీటి ధర రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు పలుకుతోంది.
ఆకట్టుకుంటున్న శిల్పాలు....
ఒడిశాకి చెందిన కళాకారులు శాండ్‌స్టోన్‌తో తయారు చేసిన శిల్పాలు సందర్శకులని కట్టిపడేస్తున్నాయి. శిల్పాలు వారి కళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఇందులో దేవదాసి, రాధాకృష్ణ, రాధాబుద్ధ, నటరాజ్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటి ధర రూ. 1500 రూపాయల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉన్నాయి.