పోర్టు డైరెక్టర్గా జేసీ బాధ్యతల స్వీకరణ
కాకినాడ సిటీ :
జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పోర్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టీ నంబర్ 1653 ప్రకారం, ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సంబంధిత పత్రాలపై జేసీ సంతకాలు చేశారు. అనంతరం పోర్టు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. డైరెక్టర్ ఆఫ్ పోర్ట్సు పరిధిలో ఉన్న 14 పోర్టులకు సంబంధించి పూర్తి సమాచారం, కార్యకలాపాల వివరాలు తెలుసుకుని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ, పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మెరైన్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ డి.వెంకటేశ్వరరావు, పీఎస్ టూ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ బెనర్జీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.