ప్రత్యేక హోదా కోసం యుద్ధం ప్రకటించాలి: నారాయణ
బళ్లారి : పనికిమాలిన రెండు కేంద్ర మంత్రి పదవులను త్యజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలుగుదేశం పార్టీకి సూచించారు. ఆయన గురువారం బళ్లారి నగరంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా నగరంలోని రాయల్‌ఫోర్ట్ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని పార్లమెంటులో డిమాండ్ చేసిన బీజేపీ కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంలో నిర్లక్ష్యం చూపుతున్నందున వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగి పోరాటానికి సిద్ధపడాలన్నారు.
అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి చంద్రబాబు తీసుకెళ్లకపోతే తామే అఖిలపక్ష బృందంతో ఢిల్లీకి వెళతామన్నారు. పోలవరానికి రూ.20 వేల కోట్లు కావాల్సి ఉండగా, కేవలం రూ.100 కోట్లు కేటాయిస్తే ఎన్ని సంవత్సరాలకు ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కేంద్రంతో మెతకవైఖరి అవలంభిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాటం చేయకపోతే ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సినీనటుడు పవన్ కళ్యాణ్ రైతుల కోసం రాజధాని భూముల్లో పర్యటన చేయలేదని, చంద్రబాబు కోసమే ఆయన పర్యటన సాగిందన్నారు. తాము తమల పాకులతో కొడతాము, మీరు తలుపులతో కొట్టండి అన్న చందంగా చంద్రబాబు, మోడీ తీరు ఉందని వ్యంగ్యంగా అన్నారు. కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్న వెంకయ్యనాయుడు పెద్ద అబద్దాలకోరు అని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ 10 సంవత్సరాలు కొనసాగాలని అప్పట్లో రాజ్యసభలో గొడవ చేసిన వెంకయ్య నాయుడు నోటికి ప్రస్తుతం తాళం పడిందన్నారు. ఆయనకు గట్టిగా మాట్లాడితే తన మంత్రి పదవీ ఊడిపోతుందనే భయం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు.