యూరి ఉగ్రదాడి ప్లాన్ ఇదే..
న్యూఢిల్లీ: యూరి సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉపయోగించిన మ్యాప్ ఒకటి భారత అధికారులకు చిక్కింది. ఆఫ్గనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ లలో ఉపయోగించే పాష్తో భాషలో ఉన్న ఆ మ్యాప్‌ను అధికారులు విశ్లేషించారు. దాడికి సంబంధించి ఉగ్రవాదులు ముందుగా రూపొందించుకున్న ప్లాన్ ఆ మ్యాప్ ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఉగ్రవాదులు ముందుగా ఆయుధాలు లేని ట్రూప్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత బ్రిగేడ్ అడ్మినిస్ట్రేటీవ్ బ్లాక్ సమీపంలో ఉన్న మెడికల్ యూనిట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరికి ఆత్మాహుతికి పాల్పడి వీలైనంత ప్రాణనష్టం కలిగించాలనేది ఉగ్రవాదుల టార్గెట్‌గా ఉందని మ్యాప్ ద్వారా వెల్లడైంది. జైషే మహ్హద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న సిపా-ఎ-సహబ పాకిస్తాన్(ఎస్ఎస్పీ) ఈ దాడిలో కిలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు.
ప్లాన్ ప్రకారం ముందుగా అడ్మినిస్ట్రేటీవ్ బ్లాక్‌లో ఇంధన ట్యాంకుల నుంచి డీజిల్‌ను బ్యారెల్స్లోకి నింపుతున్న నిరాయుధ సైనికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి జరిపారు. ఇక్కడ 3 నిమిషాల వ్యవధిలో 17 గ్రెనేడ్లను ఉగ్రవాదులు విసిరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అక్కడ ఉన్న డీజిల్ డంప్, టెంట్లకు మంటలంటుకొని 13 మంది సైనికులు సజీవదహనం కాగా 32 మందికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.
ఊహించని విధంగా తీవ్రమైన మంటలు చెలరేగడంతో అప్పటికప్పుడు టార్గెట్‌ను మార్చుకున్న ఉగ్రవాదులు నేరుగా సైనికుల శిబిరాల వైపు కదిలారు. ఆ సమయంలో అక్కడ ఉన్న 19 ఏళ్ల డోంగ్రా యూనిట్ సైనికుడు.. ఓ తీవ్రవాదిని హతమార్చాడు. మిగిరిన ముగ్గురు ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంగా అతడి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం సైనిక శిబిరాల్లో సేఫ్ పొజిషన్ తీసుకున్న ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు కాల్చిచంపారు.