మండలానికో ఉద్యానాధికారి!
సర్కారుకు ఉద్యానశాఖ ప్రతిపాదన
గ్రీన్హౌస్, సూక్ష సేద్యం పథకాల నేపథ్యంలో సిబ్బంది పెంపునకు విజ్ఞప్తి
సీఎం ఆమోదిస్తే 500 కొత్త ఉద్యోగాలకు అవకాశం
హైదరాబాద్: వ్యవసాయశాఖలో మాదిరిగానే ఉద్యాన శాఖలోనూ ప్రతి మండలానికి ఒక ఉద్యానాధికారి (హెచ్‌వో)ను నియమించాలని ఆ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తద్వారా ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులకు పూర్తిస్థాయిలో సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని పేర్కొంటోంది. ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చింది. పూర్తి సమాచారంతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఆమోదం పొందాలని భావిస్తోంది. కేసీఆర్ ఆమోదిస్తే ఉద్యానశాఖలో 500 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి..
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ముఖ్యంగా గ్రీన్హౌస్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి, ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.250కోట్లు కేటాయించింది. ఇక రాష్ట్రంలో కూరగాయల అవసరాల్లో 85శాతం పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీన్ని నివారించాలని, కూరగాయల సాగును పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే దాదాపు 10 వేల ఎకరాల్లో అదనంగా ఉల్లి సాగు చేపట్టాలని నిర్ణయించింది. వీటితోపాటు సూక్ష్మ, బిందు సేద్యంపైనా దృష్టిపెట్టింది. ఇవన్నీ ఉద్యానశాఖ పరిధిలోవి కావడంతో ఆ శాఖపై బాధ్యతలు పెరిగాయి. కానీ సరిపడా సంఖ్యలో సిబ్బంది లేరు. ఈ శాఖలో మంజూరైన పోస్టులు 150 మాత్రమేకాగా... ఇందులోనూ 75 ఖాళీగానే ఉన్నాయి. ఉద్యానశాఖ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సిబ్బంది ఏమాత్రం సరిపోరని... సిబ్బందిని పెంచాలని ఆ శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.
ప్రతీ మండలానికి ఒక ఉద్యానాధికారి, జిల్లా కేంద్రంలో కొన్ని పోస్టులను ఏర్పాటు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త పోస్టులు ఏర్పడతాయని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఉద్యాన పంటల సాగు పరిస్థితి ఏమిటి, నిబంధనల ప్రకారం ఎన్ని ఎకరాలకు ఒక ఉద్యానాధికారి అవసరం? వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై దీనిపై విజ్ఞప్తిచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.