ఫీజు బకాయిలు రూ. 3,391.91 కోట్లు
⇒ నిధుల విడుదలలో జాప్యంతో పేరుకుపోతున్న బకాయిలు
⇒ 2016–17కు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత
⇒ దరఖాస్తుల ఆధారంగా రూ. 2,171.35 కోట్లు అవసరమని అంచనా
⇒ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన సంక్షేమ శాఖలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఏయేడుకాయేడు ఏక కాలంలో నిధులు ఇవ్వకపోవడం.. దఫదఫాలుగా ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో బకాయిలు రెట్టింపవుతున్నాయి. 2016–17 వార్షికసంవత్సరం మరో పక్షం రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారం వరకూ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,65,052 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా సంక్షేమ శాఖలు ఆయా దరఖాస్తులను పరిశీలించి అవసరమైన బడ్జెట్‌పై అంచనాలు సిద్ధం చేశాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి రూ. 2,171.35 కోట్లు అవసరమని నిర్ధారించారు. ఇందులో ఉపకారవేతనాలకు సంబంధించి రూ.564.44 కోట్లు కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.1,606.86 కోట్లుగా ఖరారు చేశారు. తాజాగా ఈ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి నివేదించారు.
2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజుల చెల్లింపుల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మెజార్టీ విద్యార్థులు కోర్సు పూర్తిచేసినప్పటికీ ఫీజులు చెల్లించని కారణంగా ఆయా విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. దీంతో వారంతా కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో 14.41 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిగృహాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం రూ.2,920 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్‌లోనే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు మూడు దఫాలుగా రూ.1,700 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.1,220.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 2016–17 వార్షిక సంవత్సరం సైతం ముగియనుండడంతో బకాయిలు కాస్త రూ.3,391.91 కోట్లకు చేరాయి. అయితే ప్రభుత్వం ఈ నిధుల విడుదలపై ఊసెత్తడం లేదు. దీంతో ఇవి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
విద్యార్థుల్లో ఆందోళన...
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై మెజారిటీ విద్యార్థులు ఆధారపడి చదువును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారిలో 85 శాతం ప్రభుత్వ పథకాన్నే నమ్ముకున్నారు. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం, నిధులు ఇవ్వడంలో జాప్యం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. కోర్సు పూర్తిచేసినా సర్టిఫికెట్లు పొందని పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినప్పటికీ... కాలేజీలో ఫీజులు చెల్లించని కారణంగా సర్టిపికెట్లను సదరు కంపెనీల్లో సమర్పించకపోవడంతో ఉద్యోగాన్ని సైతం దక్కించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.