పేకాట రాయుళ్ల అరెస్టు.. విడుదల
హైదరాబాద్: పేకాట ఆడుతున్న ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 45,137, ఒక కారు, మూడు బైక్‌లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికార పార్టీ నేతలు వారిని విడిపించుకెళ్లారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గాజులరామారం దేవేందర్‌నగర్ సమీపంలో ఉన్న ఓ క్వారీ షెడ్డులో కొంత కాలంగా పోతారం దుర్గయ్య అనే వ్యక్తి పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. మంగళవారం రాత్రి ఎస్ఐ లింగ్యానాయక్ సిబ్బందితో కలసి పేకాట శిబిరంపై దాడి చేశారు.
ఈ క్రమంలో గాజులరామారం గ్రామానికి చెందిన దుర్గయ్య(50), రాజు (45), శ్రీనివాస్‌రావు (41), మోహన్‌రెడ్డి (41), కూకట్‌పల్లికి చెందిన మురుగేశ్ (55), షాపూర్‌నగర్‌కు చెందిన రాములు (45), రావి నారాయణరెడ్డి నగర్‌కు చెందిన గోవింద్ (45) అనే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.45,137, ఒక కారు, మూడు బైక్‌లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోతారం దుర్గయ్య పై గతంలో పలు ఫిర్యాదులు వచ్చాయని, ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్న అతడిని ఎట్టకేలకు పట్టుకున్నామని సీఐ తెలిపారు.
అధికార నేతల హడావుడి..
పేకాట రాయుళ్ల అరెస్టుపై టీఆర్ఎస్ నేతలు, ఓ మాజీ కార్పొరేటర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం హడావుడి చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధాహ్నం 12 గంటల వరకు స్టేషన్లోనే ఉండి దర్జాగా తమ వారిని బెయిల్ పేరిట తీసుకెళ్లారు.
(జీడిమెట్ల)