అంగన్వాడీ.. అదే వేడి
సంగారెడ్డి రూరల్, న్యూస్‌లైన్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు బుధవారం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. విషయం తెలిసి పోలీసులు వారిని విద్యానగర్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసులు, సీఐటీయూ నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆందోళనకారులు అక్కడే బైఠాయించారు.
శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజయ్య ప్రశ్నించారు. కనీసం వినతి పత్రాన్ని సైతం డిప్యూటీ సీఎంకు ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవడం విచారకరమన్నారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం గత పదిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను వదిలిపెట్టారు.
కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ప్రవీణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, నాయకులు యాదగిరి, మొగులయ్య, రమేష్, మౌలాలి, అంగన్వాడీ సంఘం నాయకులు ఇందిర, సుశీల,సుకన్య,భ్రమరాంబ, శ్యామల, చంద్రకళ, పద్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.