రాజకీయాల్లో అరుదైన వ్యక్తి పోతుల
టంగుటూరు: రాజకీయాల్లో అరుదైన వ్యక్తి జెడ్పీ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య అని మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. పోతుల చెంచయ్య 18వ వర్ధంతి సందర్భంగా స్థానిక పోతుల చెంచయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో గురువారం ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు.
పోతుల చెంచయ్య తనయుడు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో మాగుంట ముఖ్య అతిథిగా మాట్లాడారు. 60 ఏళ్లకుపైగా సుదీర్ఘకాలం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా మచ్చలేని నాయకునిగా మిగలడం పోతులకే చెల్లిందన్నారు. ఆయనతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని అన్నారు.
చివరకు తన అన్న సుబ్బరామిరెడ్డిపై కాల్పులు జరిగిన సమయంలోనూ ఆయన వద్దనే పోతుల ఉన్నారని గుర్తుచేశారు. ఆయన మా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవారన్నారు. వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు మరింత విసృ్తతం చేయాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి ఆరేటి కోటయ్య మాట్లాడుతూ పట్టుదలకు మారుపేరు చెంచయ్య అన్నారు. ఆయన కృషి ఫలితంగానే టంగుటూరులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, టీటీడీ కల్యాణ మండపం ఏర్పాటైందన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎదిగిన పోతుల ఎందరికో ఉద్యోగాలు కల్పించారని చెప్పారు.
తాను పోతుల అండతోనే రాజకీయాల్లో ఎదగగలిగానని అన్నారు. టుబాకో బోర్డు డెరైక్టర్ రావూరి అయ్యవారయ్య మాట్లాడుతూ ఏదైనా పనిమీద చెంచయ్య వద్దకు వెళ్తే..రెండో రోజు ఆయనే ఆ పని ఏమైందని మమ్మల్నే అడిగేవారని..అప్పటికీ కాకుంటే వెంటబెట్టుకుని సంబంధిత అధికారి దగ్గరకు తీసుకెళ్లి మరీ పని పూర్తి చేయించేవారన్నారు.
కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ తన తండ్రి పేరున సేవా కార్యక్రమాలు చేసేందుకు పోతుల చెంచయ్య ఫౌండేషన్‌ను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కరపత్రాలను సభలోనే ఆవిష్కరించారు. చెన్నై గ్లోబల్ ఆస్పత్రి ప్రతినిధి భాస్కరరెడ్డి మాట్లాడుతూ జబ్బులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
కార్యక్రమంలో చెన్నై గ్లోబల్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు, ఎన్టీఆర్ వైద్య సేవాపథకం కోఆర్డినేటర్ సతీష్‌రెడ్డి, డీవోఎం సంతోషి, కందుకూరు కోటారెడ్డి, ఒంగోలు రిమ్స్, అమృత ఆస్పత్రి వైద్యనిపుణులు, ఇతర వైద్యులు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పోతుల నరసింహారావు, మండలంలోని అన్ని గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.