పేదరికం అంచున అమెరికా బాల్యం
♦ దారిద్య్ర పరిస్థితులు ఎదుర్కొంటున్న సగం మంది చిన్నారులు
♦ 2008- 2014 మధ్య 18 శాతం పెరిగిన పేద పిల్లల సంఖ్య: నివేదిక
న్యూయార్క్: అమెరికాలో సగం పిల్లలు దారిద్య్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. వారందరికీ రోజువారీ అవసరాలు తీరడం కూడా కష్టంగా ఉందని పేర్కొంది. కొలంబియా వర్సిటీలోని జాతీయ పిల్లల పేదరిక కేంద్రం(ఎన్సీసీపీ) తాజాగా ఈ నివేదికను వెల్లడించింది.
అమెరికాలోని సుమారు 3.1 కోట్ల మంది చిన్నారులు ఆర్థిక అస్థిరత, పేదరిక పరిస్థితుల మధ్య గడుపుతున్నారని నివేదికలో తెలిపారు. నివేదిక ప్రకారం.. 2008 నుంచి 2014 వరకు పేద చిన్నారుల సంఖ్య 18 శాతానికి పెరిగింది. తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో ఉన్న పిల్లల సంఖ్య 10 శాతం పెరిగింది. 2014 లెక్కల ప్రకారం నలుగురు సభ్యులు(భార్య, భర్త, ఇద్దరు పిల్లలు) గల ఓ కుటుంబ సంవత్సర ఆదాయం 48,016 డాలర్లుగా ఉంటే ఆ కుటుంబం పేదరికంలో ఉన్నట్లు లెక్క.
అయితే అంతకంటే 200 శాతం తక్కువ ఆదాయం ఆర్జిస్తున్న కుటుంబాలనే పేదరికంలో ఉన్నట్లు ఎన్సీసీపీ పరిగణనలోకి తీసుకొని లెక్కలు కట్టింది. ప్రతి పది మందిలో నలుగురి కన్నా ఎక్కువ మంది పిల్లలు దారిద్య్ర రేఖకు అత్యంత చేరువలో ఉన్నారు. 2014లో 18 ఏళ్లలోపు ఉన్నవారిలో 44 శాతం మంది తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో, 21 శాతం మంది పేద కుటుంబాల్లో ఉన్నారు.
ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీరిలో 47 శాతం మంది చిన్నారులు తక్కువ ఆదాయం గల కుటుంబాల్లో ఉన్నారు.12 నుంచి 17 ఏళ్లలోపు వారిలో 40 శాతం చిన్నారులు పేద కుటుంబాల వారే. నల్లజాతి, హిస్పానిక్, అమెరికా జాతికి చెందిన పిల్లల్లో 60 శాతం మంది ి పేదరికంలో ఉండగా, ఆసియా, శ్వేతజాతివారిలో 30 శాతం పేదరికంలో ఉన్నారు.