2020లో పేదరికంలోకి 7 కోట్ల మంది.. భారత్లోనే 5.6 కోట్లు
వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి జారుకున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోయారు. అందులో 79 శాతం (5.6 కోట్లు) ఒక్క భారత్లోనే ఉండటం గమనార్హం. ‘పేదరికం, భాగస్వామ్య శ్రేయస్సు 2022’ అనే పేరుతో నివేదిక విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్. కరోనా వైరస్ ప్రపంచ పేదరికంపై కోలుకోలేని దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వైరల్ ప్రభావంతో ప్రపంచ పేదరికం రేటు 2019లో 8.4గా ఉండగా అది 2020లో 9.3కి చేరినట్లు నివేదించింది.
నివేదిక ప్రకారం.. 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 7.1 కోట్ల మంది కడు పేదరికంలోకి వెళ్లారు. దీంతో మొత్తం పేదరికుల సంఖ్య 70 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ పేదరికం పెరుగుదలకు ప్రధానంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలే కారణమని తెలిపింది. 7 కోట్ల మందిలో భారత్ నుంచి 5.6 కోట్ల మంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆర్థికంగానూ భారత్ తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. మరోవైపు.. ప్రపంచంలోనే జనాభాలో తొలిస్థానంలో ఉన్న చైనా మాత్రం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్