విద్యుత్ సంక్షోభం
- ఆగిపోయిన పవన్ విద్యుత్ ఉత్పత్తి
- 2500 మెగావాట్లకు చేరుకున్న కొరత
- రాష్ర్టంలో మళ్లీ మొదలైన అధికారిక కోతలు
సాక్షి, చెన్నై : రాష్ర్టంలో రోజుకు విద్యుత్ వాడకం 13 వేల మెగావాట్లు. ఉత్పత్తి అందుకు భిన్నంగానే ఉంది. దీంతో రాష్ట్రంలో కోతలు అమలు చేయక తప్పలేదు. ఈ కోతల్ని ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. లోక్ సభ ఎన్నికల్ని టార్గెట్ చేసిన అన్నాడీఎంకే సర్కారు, విద్యుత్ ఉత్పత్తి మెరుగు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందడం, ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు చర్యలు చేపట్టడంతో కొంత మేరకు కొరతను అధిగమించారు. ఎన్నికల ముందు కొద్ది రోజులు సంపూర్ణ విద్యుత్‌ను అందించిన అధికార యంత్రాంగం, ఎన్నికల అనంతరం మళ్లీ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడింది. గత నెల వరకు కోతల రహితంగా విద్యుత్‌ను అందించారు. అయితే గత నెలాఖరులో విద్యుత్ చార్జీల వడ్డనకు కసరత్తులు ఆరంభం కావడం, మరుసటి రోజే పరిశ్రమలకు విద్యుత్ ఆంక్షల చిట్టా వెలువడడంతో మళ్లీ కోతలు ఆరంభమైనట్టేనన్న సంకేతాలు వచ్చాయి.
కోతలు: పండుగ సీజన్ ఆరంభం కావడంతో సంపూర్ణ విద్యుత్ తక్కుతుందన్న ఆశాభావం ప్రజల్లో ఉన్నా, చివరకు సంక్షోభం పుణ్యమా కోతల్ని ఎదుర్కొనక తప్పలేదు. ప్రధానంగా రాష్ట్రంలో గత నెల 25 నుంచి క్రమంగా విద్యుత్ కొరత ఏర్పతోంది. 26న 940 మెగావాట్లు, 27న 1194 మెగావాట్లు, 29న 2200 మెగావాట్లు ఉన్న విద్యుత్ కొరత, బుధవారానికి 2500 మెగావాట్లకు చేరింది. రోజుకు 2500 మెగావాట్ల కొరత ఏర్పడటంతో కోతల మోత మోగించేందుకు రాష్ట్ర విద్యుత్ బోర్డు సిద్ధం అయింది. గ్రామాల్లో నాలుగు గంటల మేరకు, నగరాల్లో రెండు గంటల మేరకు కోతలు విధించే పనిలో పడ్డారు. అనధికారిక కోతలు అడపాదడపా అమల్లో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతంత మాత్రమే. ఈ సంక్షోభం క్రమంగా తీవ్రరూపం దాల్చిన పక్షంలో గ్రామాలు అంధకారంలో మునగాల్సిందే.
పవనం జాడేదీ? : దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, విరుదునగర్, తేని తదితర జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. పశ్చిమ పర్వత శ్రేణుల్ని ఆనుకుని ఉన్న జిల్లాల్లో పవన విద్యుత్ ఇన్నాళ్లు ఆశాజనకంగా ఉంది. రెండు వేల మెగావాట్ల వరకు పవన విద్యుత్ అందుతుండగా, రెండు రోజుల క్రితం నుంచి క్రమంగా ఉత్పత్తి తగ్గుతూ వచ్చింది. చివరకు ఉత్పత్తి జీరోకు చేరడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. అలాగే, నైవేలిలో సాగుతున్న ఒప్పంద కార్మికుల సమ్మె పుణ్యమా అని అక్కడ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతున్నది. దీంతో రాష్ట్ర వాటాకు కోత పడడంతో మరింత లోటు తప్పలేదు. తూత్తుకుడి, చెన్నై ఉత్పత్తి కేంద్రాల్లోని యూనిట్లలో తలెత్తిన సాంకేతిక లోపంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. సాంకేతిక సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు నిమగ్నం అయ్యాయి. అయినా, పవన విద్యుత్, నైవేలి రూపంలో విద్యుత్ సంక్షోభం జఠిలం అయ్యే అవకాశాలు ఎక్కువే.