విద్యుత్ కోతలపై ఆగ్రహం
నారాయణఖేడ్: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని మనూరు రైతులు రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచీ విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండటంతో వ్యవసాయం చేయలేకపోతున్నామని మంగళవారం నారాయణఖేడ్ సబ్‌స్టేషన్ వద్ద రైతులు కన్నెర్ర జేశారు. విద్యుత్ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని మండిపడ్డారు.
మనూరు మండలం పుల్కుర్తి, దోసపల్లి, బాదల్గావ్, బెల్లాపూర్ గ్రామాల రైతులు ముందుగా మనూరు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో అక్కడి నుంచి వాహనాల ద్వారా 133-11కేవీ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. ఏడీఈ, ఏఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందితో విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా వ్యవసాయానికి గంట కూడా విద్యుత్ సరఫరా ఉండడం లేదని వాపోయారు.
కరెంట్ సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. మరోవైపు లోఓల్టేజీలతో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీఈ, ఏఈ వచ్చే వరకు ధర్నా విరమించబోమని ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఖేడ్ ఏడీఈ రవీందర్‌రెడ్డి, మనూరు ఏఈ అశోక్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించి ఆందోళనకారులను శాంతింపజేశారు.