దొరల తెలంగాణ కోరుకుంటున్న ప్రభుత్వం
సీపీఎం బస్సుజాతా ప్రారంభ కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం
హైదరాబాద్: నాడు భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ ప్రజలు పోరా టం చేసి దొరల అరాచకాలను, రాచరిక పాలనను నిర్మూలించగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం దొరల తెలంగాణను కోరుకుంటోందని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు.
మార్చి ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు హైదరాబాద్లో జరిగే సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలను జయప్రదం చేయాలంటూ చేపట్టిన బస్సుజాతాను గురువారం హైదరాబాద్ నల్లకుంటలో ఆమె ఎర్రజెండా ఊపి ప్రారంభించారు. కళాకారులతో కలసి డప్పు కొట్టి అందరినీ ఉత్తేజపరిచారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం, నవతెలంగాణ నిర్మాణం కోసం సీపీఎం ఉద్యమిస్తోందని, ప్రజలు ఆ పార్టీని ఆదరించాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునేలా ప్రజలను చైతన్యపరిచేందుకు తమ పార్టీ ప్రచారయాత్ర చేపట్టిందని చెప్పారు.