భవిష్యత్తు వైఎస్సార్ సీపీదే
కేసీఆర్ పాలనలో కీలక మార్పులు
జ్యోతిష నిపుణుడు ప్రదీప్‌జోషి
పంజగుట్ట, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ జ్యోతిష నిపుణుడు ప్రదీప్‌జోషి అన్నారు. ఏపీలో జగన్ పాత్ర కీలకమవుతుందని, ప్రతిపక్ష నేతగా ఆయనకు ఆదరణ మరింత పెరుగుతుందన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1న ఉగాది పంచాగ శ్రవణంలో తాను చెప్పినవి చెప్పినట్టుగా జరిగాయన్నారు.
తమిళనాడులో జయలలిత కనీవినీ ఎరుగని రీతిలో సీట్లు సాధిస్తారని, బీజేపీ చరిత్రలో నిలిచిపోయే మెజారిటీ సాధిస్తుందని తాను ముందే చెప్పానన్నారు. అక్టోబర్ 7న నవరాత్రుల సమయంలోనే ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలలో రాష్ట్రపతి పాలన రాబోతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేర బోతున్నట్లు వెల్లడించానన్నారు. చిరంజీవికి రాజకీయ భవిష్యత్తు లేదని, ఆయన తిరిగి సినీ రంగంలోనే ఆదరణ పొందుతారని చెప్పారు. రాబోయే రోజుల్లో సుష్మాస్వరాజ్ కేంద్ర హోమంత్రి పదవి చేపట్టబోతుందని, మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్సును నూతన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
నవంబర్‌లో సెన్సెక్స్ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తుందన్నారు. బంగారం ధర పూర్తిగా క్షిణిస్తుందని, షేర్ మార్కెట్లలో జరిగే అవకతవకలను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారని చెప్పారు. బీజేపీ 13 ఏళ్ల పాటు కేంద్రంలో తన హవా కొనసాగిస్తుందని, 2022 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు వచ్చి పార్టీ ఒడిదుడుకులకు లోనవుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ విశేష ప్రతిపాదనలు తీసుకువస్తారని, విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తారన్నారు. గత ప్రభుత్వం చేసిన భూ సేకరణలపై కమిటీలు వేసి, భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఖాయమన్నారు. డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ ఛాయ కూడా ఉండదని, కేవలం టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు.