71 ట్రాన్స్ఫర్లు.. ఐఏఎస్‌కు తీవ్ర అవమానం
సాక్షి, హర్యానా : ఆయన ఓ నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి. మొత్తం 34 ఏళ్ల సర్వీసు.. 71 ట్రాన్స్ఫర్లు.. ఎంతో క్రమ శిక్షణగా పనిచేసినందుకు ఆయనను చివరకు హర్యానా ప్రభుత్వం అవమానించింది. బుధవారం ఆయన పదవీ విరమణ చేయగా అంతకుముందు ఆరు నెలల నుంచి ప్రభుత్వం జీతభత్యాలు కూడా చెల్లించలేదు. తీరా ఎందుకు చెల్లించలేదని ఆరా తీస్తే ఆయనను కేటాయించిన శాఖ అసలు మనుగడలోనే లేదంట. ఇది ఆర్టీఐ ద్వారా తెలుసుకున్న ఆయన ఇప్పుడు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ట్రిబ్యునల్ మార్చి 8న నిర్ణయం వెలువరించనుంది. వివరాల్లోకి వెళితే.. ప్రదీప్ కాస్నీ అనే ఐఏఎస్ అధికారి బుధవారం రిటైర్ అయ్యారు.
ఆయన హర్యానాలోని ల్యాండ్ యూజ్ బోర్డుకు ప్రత్యేక ఆఫీసర్‌గా గత ఆరు నెలలుగా పనిచేస్తున్నారు. అయితే, ఆయనకు కొద్ది నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆయన విధుల్లో చేరిన తర్వాత ఉద్యోగులు ఎవరూ విధుల్లోకి రావడం లేదని, అధికారిక ఫైల్స్ ఏవీ కూడా తన కార్యాలయానికి రావడం లేదని, ఉన్న ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆయనకు ఎలాంటి సమాధానం దొరకలేదు. దీంతో ఆయన ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోగా అసలు ఆ బోర్డు 2008 నుంచే పనిచేయడం లేదని ప్రభుత్వం తాఫీగా సెలవు ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లు మనుగడలో లేని బోర్డుకు తనకు బాధ్యతలు ఇవ్వడంతోపాటు జీతం చెల్లించకుండా పనిచేయించుకున్నారని, తన విలువైన సర్వీసును వృధా చేశారని, ఆ కాలాన్ని తన రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగించేలా చేయాలని డిమాండ్ చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.