Union Cabinet: జన నాయకుడు మోదీ
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర కేబినెట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ సందర్భంగా దేశ ప్రజలు మోదీపై కనబరచిన ప్రేమ, ఆప్యాయతలు ఆయన నిజమైన జన నాయకుడని మరోసారి నిరూపించాయని పేర్కొంది. ‘‘రామ మందిరం కోసం ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించిన తీరు కొత్త తరానికి తెర తీసింది.
ఇదంతా మోదీ దార్శనికతతోనే సాధ్యపడింది’’ అని పేర్కొంది. భరత జాతి శతాబ్దాల కలను సాకారం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. తీర్మాన ప్రతిని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చదివి విని్పంచారు. ‘‘1947లో దేశానికి భౌతికంగా మాత్రమే స్వాతంత్య్రం వచి్చంది. దాని ఆత్మకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్ర ప్రతిష్టాపన ద్వారా ప్రాణప్రతిష్ట జరిగింది.
ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాల ద్వారా మీరు జన నాయకునిగా సుప్రతిష్టితులయ్యారు. రామ మందిర ప్రతిష్టాపన ద్వారా కొత్త తరానికి తెర తీసిన దార్శనికుడయ్యారు’’ అంటూ మోదీపై తీర్మానం ప్రశంసలు కురిపించింది. ‘‘ప్రజల్లో ఇంతటి ఐక్యత గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా కని్పంచింది. అది ఒక నియంతను ఎదిరించేందుకు జరిగిన ఉద్యమం.
ఇదేమో దేశంలో నూతన శకానికి అయోధ్య రాముని సాక్షిగా నాంది పలికిన చరిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిన ఐక్యత’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో ఆసాంతం భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయని ఒక మంత్రి తెలిపారు. రాముని ప్రాణప్రతిష్టకు సాక్షిగా నిలిచిన మంత్రివర్గంలో భాగస్వాములుగా ఉండటం గర్వకారణమని కేబినెట్ సభ్యులంతా అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఇది కొన్ని జన్మలకు ఒకసారి మాత్రమే లభించే అరుదైన అవకాశమన్నారు.
ఆ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు
రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం ద్వారా వాటి దిగుమతిని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్ల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అలాగే కోల్ ఇండియా, గెయిల్ భాగస్వామ్యంలో రూ.13,052 కోట్ల కోల్–ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్), సీఐఎల్, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంలో రూ.11,782 కోట్ల కోల్–అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది.