చంద్రబాబుకు నైతిక విలువల్లేవు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నైతిక విలువల్లేవని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పట్ల చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఆయన నీచమైన బుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెబుతున్న సీఎం.. తాను అభివృద్ధి చెందారే కానీ.. రాష్ట్రం మాత్రం ఆయన పాలనలో వెనుకబడిపోయిందన్నారు. అవినీతిలో మాత్రం రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడం వెనుక చంద్రబాబు, ఆయన కుమారునిది ఎనలేని కృషి ఉందన్నారు. ప్రతిసారి జిల్లా పర్యటనలో జిల్లాను అభివృద్ధి చేశానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు జిల్లాకు ఏం చేశారో వివరించాలన్నారు. చంద్రబాబు మాటలు ప్రకటనల వరకే పరిమితమని, ఆచరణలో అవి అమలు కావన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలకు నిధులివ్వక పోవడం దారుణమన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.