అవినీతి డొంక కదిలింది
గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్: గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో చాపకింద నీరులా సాగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల రంగ ప్రవేశంతో అక్రమాలకు పాల్పడిన వారు కట కటాల వెనక్కు వెళ్లారు. ఆలస్యంగా కళ్లు తెరచిన సంస్థ ఆదిలోనే సమస్యను పట్టించుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. పర్యవేక్షణలోపంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అవినీతికి అదుపులేకుండా పోతోంది. నిత్యం అందుబాటులో ఉంటూ గిరిజనులకు నిత్యావసర సరుకులను క్రమం తప్పకుండా అందించాల్సిన అధికారులు, సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు.
ఒక్క జీకేవీధి బ్రాంచి పరిధిలోనే రూ.71 లక్షల అవినీతి బట్టబయలు కావడం ఆ సంస్థ పనితీరుకు అద్దం పడుతోంది. ఈ బ్రాంచికి పూర్తిస్థాయి మేనేజర్ లేకపోవడంతో గోడౌన్ సూపరింటెండెంట్ కన్నయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన హయాంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించి రూ.10.30 లక్షలు, ప్రభుత్వ పాఠశాలలు, డిపోలకు చేరవేయాల్సిన సరుకులకు సంబంధించి రూ.21 లక్ష లు, ీపీడీఎస్ బియ్యానికి సంబంధించి రూ.30 లక్షలు, కిరోసిన్, గోనె సంచులకు సంబంధించి రూ.9.71 లక్షలు దుర్వినియోగం అయ్యాయి.
ఆలస్యంగా కళ్లు తెరిచిన ఆశాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన దర్యాప్తు చేపట్టి బాధ్యుడైన కన్నయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జీకేవీధి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్థానిక సీఐ రామకృష్ణారావు, ఎస్ఐ విజయకుమార్‌లు దర్యాప్తు చేపట్టారు. ఆరు నెలలుగా పరారీలో ఉన్న ఇన్చార్జి బ్రాంచి మేనేజర్ ఎం.కన్నయ్యతోపాటు చింతపల్లికి చెందిన ఆమూరి రాజుబాబు, బల్లంకి శ్రీనివాసరావు, రాజమండ్రికి చెందిన పట్టెం పరుశరాంలను శుక్రవారం అరెస్టుచేశారు.
కన్నయ్య హయాం లో వరుస అక్రమాలు చోటుచేసుకున్నట్టు తమ విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన జీసీసీ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇది ఈ ప్రాంతంలో సంచలమైంది. ఇంతవరకూ ఏ జీసీసీ అధికారీ ఇలా అరెస్టు కాలేదు.