ప్రజాపోరుకు రెడీ
⇒ వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయసాయిరెడ్డి ఉద్బోధ
⇒డిసెంబర్ 5న ధర్నాతో ఉద్యమబాటకు శ్రీకారం
⇒జిల్లా విసృ్తతస్థాయి సమావేశంతో కార్యకర్తల్లో కదనోత్సాహం
సీతమ్మధార(విశాఖపట్నం): ‘ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు అసమర్థ, అవినీతిపాలనపై ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలి’అని వైఎస్సార్‌కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. డిసెం బర్ 5న పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్న మహాధర్నాను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన జిల్లా పార్టీ విసృ్తతస్తాయి సమావేశంలో విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఉద్బోధించారు.
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం కావాలన్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనే జిల్లా అభివృద్ధి చెందిందని సోదాహరణంగా వివరించారు. విమ్స్ స్థాపన వైఎస్సార్ కృషేనన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని ప్రతిపాదన వైఎస్సార్ హయాంలోనే వచ్చిందన్నారు. బీహెచ్‌పీవీ, షిప్‌యార్డ్ వంటి సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర నిధులు రాబట్టడం ద్వారా కార్మికులను ఆదుకున్నారని ఆయన తెలిపారు.
జిల్లాలో తాండవకు రూ. 55 కోట్లు, రైవాడకు రూ. 25 కోట్లు, కోనాం ప్రాజెక్టుకు రూ. 21 కోట్లతో పనులు ప్రారంభించి 75శాతం పూర్తి చేస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలల్లో బడ్జెట్లో ఒక్క పైసా కూడ కేటాయించిన పాపాన పోలేదన్నారు. వైఎస్ హయాంలో జిల్లాలో 3.20లక్షల ఇళ్లు నిర్మించారని, 3.20లక్షలమందికి కొత్తగా పింఛన్లు ఇప్పించారన్నారు. చంద్రబాబు ఈ ఆరునెలల్లో ఒక్క ఇల్లు కట్టించకపోగా 49వేల మందికి పింఛన్లు తొలగించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.
డిసెంబర్ 15నాటికి జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తామన్నారు. పార్టీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు సుజయకృష్ణ రంగారావు మట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొనున్న ధర్నాను విజయవంతం చేయడానికి గ్రామాలు, వార్డులవారీగా రైతులు, మహిళలను సమీకరించాలన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలతో ద్వారా గిరిజనుల జీవనాన్ని ఛిన్నాభిన్నం చేసే చంద్రబాబు కుట్రను తిప్పికొడతామన్నారు. బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గకపోతే గిరిజనులతో కలసి ప్రభుత్వంపై భారీపోరాటం చేస్తామన్నారు.
ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహం చెందకుండా పార్టీ బలోపేతానికి సమన్వయంతో పని చేయాలన్నారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాట్లాడుతూ సీపోర్టు, ఎయిర్‌పోర్టు, తూర్పుకనుమల్లో అపారమైన సంపదనుదోచుకోవడానికి చంద్రబాబు విశాఖపట్నంపై పడ్డారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గ్రామ,వార్డు, మండల, జిల్లాస్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి, బలోపేతం చేయాల్సి అవసరం ఉందన్నారు. జీవీఎంసీ ఎన్నికలలో సైనికుల్లా పనిచేసి అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వార మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్పారు.
పార్టీ నేతలు ఏమన్నారంటే..
పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ 10ఏళ్ల తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో దొంగలు పడ్డ రీతిలో దోచుకుంటున్నారని విమర్శించారు. అధికార ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలముందుకు కెళ్లేందకు భయపడే పరిస్థితి ఉందన్నారు. పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ రుణాలు కోసం చంద్రబాబు కేవలం తమపార్టీ కార్యకర్తలు దండుకునే విధంగా కమిటీలు ఏర్పాటు చేసిన వ్యక్తలుచేత సంతకాలు పెట్టుకోవల్సిన దుస్థితి కల్పించారన్నారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు, భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలు కొనసాగిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల తరుపు పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూధనరెడ్డి మట్లాడుతూ వైఎస్ హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు బాబు పాలనలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయన్నారు. రాష్ట్ర రైతు సంఘం నాయకుడు నాగిరెడ్డి మాట్లాడుతూ రైతురుణ మాపీ అని చెప్పి చంద్రబాబు తిరిగి రైతు ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నారన్నారు. భార్యమెడలో తాళిబొట్టు వేలంపాట పడుతుందని ఆవేదనలో ఇటీవల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రంలో చాలా మందికి కంటతడి పెట్టంచిందన్నారు. రాష్ట్ర విద్యార్ధి విభాగం అధ్యక్షుడు సలాం బాబు మాట్లాడుతూ ఆంద్రప్రదశ్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని సాగితే, చంద్రబాబు పాలన అ అంటే అప్పులు, ఆ అంటే ఆత్మహత్యలుగా సాగుతుందని ఎద్దేవా చేశారు.
మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు మాపీ, మాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హ్యాపీగా కాఫీ తాగుతూ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టి ఒక్క్కొరికి బీపీ పెంచే కార్యక్రమంలో తలమునకలయ్యి ఉన్నారని ఎద్దేవా చేసారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ భవిష్యత్తులో బలోపేతం అవ్వాలంటే సమిష్టి కృషి అవసరం అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ మాట్లాడుతూ తుపాన్లో ముఖ్యమంత్రి రూ. లక్షకోట్లుగా ప్రకటిస్తే, మరో మంత్రి 50వేల కోట్లని, ఇప్పుడు 21వేల కోట్లుగా నష్టాన్ని చెబుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికలలో పీఠం కైవసం చేసుకుని జగన్మోహనరెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నారు. గాజువాక సమన్వయకర్త తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ ధర్నాకు నగరంలో ప్రతినియోజకవర్గం నుంచి 4వేలమంది, జిల్లాలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వెయ్యిమంది చొప్పన వచ్చి విజయవంత చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక,సినీ రంగాలలో శరవేగంగా అభివృద్ది చెందడానికి రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త కోలా గురువులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి డిసెంబర్ 5న విశాఖలో తలపెట్టిన ధర్నాలో ప్రజాసమీకరణతో విజయవంతం చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు నివాళులు అర్పించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. కొయ్య ప్రసాదరెడ్డి స్వాగతోపన్యాసం చెబుతూ ఈ సమావేశంతో పార్టీ మళ్లీ పోరుబాట పట్టాలని ఆకాంక్షించారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ముగింపు ఉపన్యాసం ఇస్తూ ఈ సమావేశం స్ఫూర్తి డిసెంబర్ 5న నిర్వహించనున్న ధర్నా విజయవంతానికి పార్టీ కార్యకర్తలు ఉద్యుక్తమవుతారన్నారు. హుద్‌హుద్ తుపాను మృతులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నివాళి అర్పిస్తూ ఈ సమావేశంలో నేతలు కొద్దిసేపు మౌనం పాటించారు. వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు సాగి దుర్గాప్రసాద్‌రాజు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, పార్టీ నేతలు చెంగల వెంకటరావు, బొడ్డేట ప్రసాద్, సత్తి రామకృష్ణారెడ్డి, పోతల ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు, వివిధ అనుబంధ సంఘాల ప్రతి నిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.