ఎన్నికల నేరాల విచారణకు ట్రిబ్యునల్ అవసరం
పోటీచేయని పార్టీలు సైతం నిధుల కోసం వెంపర్లాట
ఎన్నికల తరువాత అధికారాలను కోల్పోతున్న కమిషన్
కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్
కాచిగూడ: దేశంలో ఎన్నికల నేరాలను విచారించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. రాజకీయ పార్టీలను నియంత్రించడానికి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించా రు. ఆదివారం కాచిగూడ బద్రుక కళాశాల ఆడిటోరియంలో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ ఐదో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘రాజకీయ పార్టీలు - క్రమబద్ధీకరణ’ అనే అంశంపై మాడభూషి శ్రీధర్ మాట్లాడు తూ దేశంలో 1,703 రాజకీయ పార్టీలకు గాను అందు లో 6 జాతీయ పార్టీలు ఉన్నాయన్నారు. 1,012 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎన్నికల నిధులను వసూలు చేస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగంలో పార్టీ ల ప్రస్తావనే లేదని గుర్తుచేశారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటివరకు బడా సంస్థ ల వారు రాజకీయ పార్టీలకు చందాలిచ్చి రూ.30 లక్షల కోట్ల మేర పన్ను రాయితీలు పొందారన్నారు. ఎన్నికల తరువాత ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి అధికారాలు ఉండటం లేదని, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు నిధుల కోస మే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, వారిని అడిగే నాథుడే లేడన్నారు. కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి చైర్మన్ పి.హనుమాన్ చౌదరి, ప్రధానకార్యదర్శి నాగరాజారావు పాల్గొన్నారు.