నాసిక్‌లో ఎంఆర్టీఎస్
అభివృద్ధి ముసాయిదా ప్రణాళిక రూపకల్పన చేస్తున్న ఎన్ఎంసీ
నాసిక్: పట్టణవాసులకు శుభవార్త. రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా నాసిక్ నగరపాలక సంస్థ (ఎన్ఎంసీ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పట్టణంలో అద్భుతమైన రహదారి వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ముసాయిదా అభివృద్ధి ప్రణాళికను (డీడీపీ)రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ విషయాన్ని ఎన్ఎంసీ టౌన్ ప్లానింగ్ సంయుక్త సంచాలకుడు ప్రకాశ్ భుక్తే మాట్లాడుతూ పట్టణంలో చక్కని రహదారి వ్యవస్థ రూపకల్పన అంశంపై దృష్టి సారించామన్నారు. పట్టణంలో జనాభా సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (బీఆర్టీఎస్) మాదిరిగానే మాస్ రోడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్టీఎస్)ను రూపొందించనున్నట్టు చెప్పారు.
అయితే అది ఏవిధంగా ఉండాలనే అంశంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇందుకోసం బిల్డర్లు, ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళికా విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ డెరైక్టర్లతో ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేశామన్నారు. గతంలో చేపట్టిన ఇన్నర్, మిడిల్, ఔటర్ రింగ్ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.