జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు పేదలకు ఉత్తమ వైద్య సేవలను అందించే క్రమంలో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ తెలిపారు. వికాస సౌధలో బుధవారం ఏర్పాటు చేసిన వైద్యుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
బెంగళూరు, రాయచూరు సహా ఆరు నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించాలనే యోచన కూడా ఉందన్నారు. కొందరు వైద్యులు రోగులను దోచుకుంటున్నారని, ఈ విధానాన్ని విడనాడాలని హితవు పలికారు. అనంతరం ప్రసంగించిన ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ వైద్యులు తమ ముందుంచిన పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే ఉత్తమ సేవలు అందిస్తున్నాయని కితాబునిచ్చారు.
అందరికీ టెన్షనే...
ఈ సందర్భంగా మంత్రి ఖాదర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘ప్రతి ఒక్కరికీ ఏదోక టెన్షన్ ఉంటుంది. మంత్రిగా నాకూ టెన్షన్ ఉంది. మా అధికారం తాత్కాలికం, మీ సేవలు శాశ్వతం’ అని వైద్యులనుద్దేశించి అన్నారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అనేక పథకాలున్నాయని చెబుతూ, వాటిని పూర్తి చేసేంత వరకు వేరే పథకాలు వద్దని ముఖ్యమంత్రికి కూడా సూచించానని తెలిపారు.
తొలుత ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. వైద్యుల వేతనాలను పెంచాలని కూడా కోరానని వెల్లడించారు. ‘మంత్రి గోల్ కీపర్ మాదిరి. తొమ్మిది గోల్స్‌ను ఆపి, పదో గోల్‌ను వదిలేస్తే...అతనికి మూఢినట్లే. తొమ్మిది మంచి పనులను చేసిన మంత్రి పదో సందర్భంలో విఫలమైతే...అతని గ్రహచారం’ అని ముక్తాయింపునిచ్చారు.