‘చాచా చౌదరి’ ప్రాణ్ ఇక లేరు!
సుప్రసిద్ధ భారతీయ కామిక్ క్యారెక్టర్ చాచాచౌదరి సృష్టికర్త ప్రాణ్ బుధవారం గుర్గావ్లో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. క్యాన్సర్‌తో బాధపడ్తూ ఆస్పత్రిలో చేరిన ఆయన గుండెపోటుతో మరణించారని ప్రాణ్ కుమార్తె తెలిపారు. ఎర్రటి తలపాగా ధరించిన బక్కపలచటి మనిషి చాచాచౌదరి, భీమబలుడు అయిన అతని అనుచరుడు సాబూ పాత్రలతో ప్రాణ్ భారతీయ కామిక్ చరిత్రలో అద్భుతాన్ని సృష్టించారు. చాచాచౌదరి బుద్ధి బలం, సాబూ బాహుబలం కలిసి అతి క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తుంటారు. భారతీయ మధ్య తరగతి విలువలతో, గ్రామీణ నేపథ్యంలో ఆయన రూపొందించిన పాత్రలు దేశంలో అన్ని వయసులవారిని అలరించడమే కాక విదేశీ కార్టూన్ క్యారెక్టర్ల ధాటికి తట్టుకుని నిలిచాయి.
దేశవిభజనకు ముందు లాహోర్ వద్దనున్న కసూర్‌లో 1938లో జన్మించిన ప్రాణ్‌కుమార్ శర్మ ఢిల్లీకి చెందిన మిలాప్ దినపత్రికలో కార్టూనిస్ట్‌గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1969లో లట్పట్ అనే హిందీ పత్రిక కోసం ఆయన సృష్టించిన చాచాచౌదరి అనే కార్టూన్ క్యారెక్టర్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగింది. చాచాచౌదరికి తోడుగా ఆయన సాబూ, పింకీ, శ్రీమతీజీ, బిల్లూవంటి అనేక పాత్రలను సృస్టించారు. పాశ్చాత్య కార్టూన్ పాత్రల్లాగ వీటికి అద్భుత శక్తులేవీ లేకపోయినా అవి చిరుదొంగల నుంచి ఉగ్రవాదుల వరకు పలురకాల దుష్టశక్తులను తుదముట్టించేవి.. చాచాచౌదరి కామిక్ పుస్తకాలే కాక, టీవీ సీరియల్ కూడా ప్రజాదరణ పొందింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ ఆయనను 2001లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. భారత్‌లో కార్టూన్లకు ప్రజాదరణ కల్పించినందుకు ఆయనకు 1995 లిమ్కా బుక్‌లోనూ చోటు దక్కింది.