‘పులి’ దారికి అడ్డురాం!
► వన్యప్రాణి ప్రాంతంలో రూ.444 కోట్లతో ఎకో బ్రిడ్జీలు నిర్మిస్తాం
► ప్రాణహిత కాల్వలపై జాతీయ వన్యప్రాణి బోర్డుకు అధికారుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు పనుల్లో భాగంగా వన్యప్రాణి ప్రాంతంలో పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కవ్వాల్ వన్యప్రాణి అటవీ ప్రాంతంలో పులులు సంచరించే మార్గాలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా ఎకో–బ్రిడ్జీలు నిర్మి స్తామని ప్రతిపాదించింది. ఇందుకు ఏకంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రూ.444 కోట్లు వెచ్చిం చేందుకు సిద్ధంగా ఉన్నామని జాతీయ వన్యప్రాణి బోర్డుకు తెలిపింది. ప్రాణహిత ప్రాజెక్టుకు మొత్తంగా రూ.6,465 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 8,709.5 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా వేయగా.. అందులో రిజర్వ్ అటవీ భూమి 2,840.01 ఎకరాల మేర ఉంది.
ఆ అటవీ భూమిలో 1,155 ఎకరాలు (622 హెక్టార్లు) టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది. దీంతో పర్యావరణ అటవీ అనుమతులతో పాటు వన్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసయ్యాయి. శని వారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, వన్యప్రాణి బోర్డు చైర్మన్ ముందు రాష్ట్ర అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా పులులు, చిరుతలు సంచారం చేసే టైగర్ రిజర్వ్‌లో అన్ని రకాల సంరక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.444.94 కోట్లతో ఎకో బ్రిడ్జీలు నిర్మిస్తామని, వాటిపై ఎలాంటి కాంక్రీటు నిర్మాణం కనిపించకుండా చెట్లు, పూల మొక్కలు పెంచుతామన్నారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపాదనలను విన్న బోర్డు చైర్మన్... ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను వచ్చే నెలకు వాయిదా వేశారు.