23న కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
కరీంనగర్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఈ నెల 23న మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకుంటున్న ఒప్పందానికి నిరసనగా అదే రోజు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం తెలిపారు. ఇరురాష్ట్రాల సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, కె.చంద్రశేఖర్‌రావు అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల పేరున మార్చి 8న ఒప్పందాలు జరిగాయని సంబరాలు జరుపుకుని మేడిగడ్డ వద్ద స్వయాన కేసీఆర్ భూమిపూజ చేశారని పేర్కొన్నారు. మళ్లీ ఈనెల 23న మహాఒప్పందం పేరుతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అవ్వడాన్ని తెలంగాణకు చీకటిరోజుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అశాస్త్రీయమైన విధానాలతో ప్రాజెక్టుల అంచనాలను వాస్తవానికంటే ఎన్నోరేట్లు అధికంగా పెంచి రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. 23న కలెక్టరేట్ ఎదుట నల్లా జెండాలతో నిర్వహించే నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.