విశాఖ చేరుకున్న రాష్ట్రపతి
విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్లు విశాఖపట్నం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్లు ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం పలికారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.
ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.