ఆత్మవిశ్వాసమే నా ఆయుధం
‘సాక్షి’తో మిస్ ఇండియా - యూఎస్ఏ ప్రణతి గంగరాజు
అగ్రరాజ్యం అమెరికాలో మరో ఆంధ్ర రత్నం మెరిసింది. ఇటీవల న్యూజెర్సీలోని రాయల్ ఆల్బెర్ట్స్ ప్యాలెస్‌లో జరిగిన ‘మిస్ ఇండియా యూఎస్ఏ-2014’ కిరీటాన్ని ఓ తెలుగమ్మాయి దక్కించుకుంది. యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందాల వేదికపై త ళుక్కున మెరిసి అగ్రశ్రేణి సుందరీమణుల సరసన చేరింది. నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రామచంద్ర వరప్రసాద్, మైత్రేయిశర్మ కుమార్తె 19ఏళ్ల ప్రణతి గంగరాజు ఈ అరుదైన అందాల కిరీటాన్ని తన సొంతం చేసుకుంది.
విజయవాడ బ్యూరో : సూర్యారావుపేటకు చెందిన గంగరాజు రామచంద్ర వరప్రసాద్ 20ఏళ్ల కిందటే అట్లాంటాలో స్థిరపడ్డారు. వీరి కుమార్తె ప్రణతి పుట్టింది వరంగల్ జిల్లా హనుమకొండలోనే అయినా రెండేళ్ల వయసు వరకు బెజవాడలోనే పెరిగింది. బాల్యంలోనే పియానో వాయించడంలో శిక్షణ పొందిన ప్రణతి నాయనమ్మ వసంతలక్ష్మి నుంచి భగవద్గీత పఠనం నేర్చుకుంది. పదేళ్ల వయసులోనే పియానో కచేరీలు చేసింది. చదువులో ప్రతిభ చూపడమే కాకుండా గాయనిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. కుమార్తెలోని ఆసక్తిని గమనించిన తండ్రి రామచంద్ర ప్రణతికి స్విమ్మింగ్, డ్రాయింగ్, డ్యాన్స్, చిత్రలేఖనం వంటివి నేర్పించారు. కథక్ డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకున్న ప్రణతి అందులోని మెలకువలన్నీ రెండేళ్లలోనే నేర్చుకుంది. కాలేజీ చదువుల రోజుల్లోనే మ్యూజిక్, డ్యాన్స్, మోనో యాక్షన్ వంటి సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా యూఎస్ఏలో కళా కారిణిగా గుర్తింపు పొందింది.
20 ఏళ్ల తర్వాత దక్కిన గౌరవం
‘మిస్ ఇండియా యూఎస్ఏ’ టైటిల్ దక్కించుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. యూఎస్ఏ వేదికపై జరిగే అందాల వేదికపై ఎంతోమంది సుందరీమణులు మెరిసిపోతుంటారు. వీరందరినీ అధిగమించి కిరీటం దక్కించుకోవడం కష్టం. 1993లో ఇదే టైటిల్‌ను రత్న కంచర్ల అనే తెలుగమ్మాయి సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ప్రణతికి దక్కింది. లాస్ఏంజిల్స్లోని లీస్ట్రాస్బర్గ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ పొందుతున్న ప్రణతికి స్వదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ. రెండేళ్ల కిందటే ఈమె ‘మిస్ ఇండియా జార్జియా ఫర్ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్’ టైటిల్ దక్కించుకుంది. 2016 జూన్‌లో గోవా కేంద్రంగా జరిగే ‘24వ మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పీజెంట్’ పోటీలకు సిద్ధమవుతోంది. ఈ పోటీలకు హాజరయ్యే ఏకైక తెలుగు యువతి కూడా ప్రణతినే.
అన్నింట్లోనూ ప్రతిభ కలిగి ఉండాలి..
నాకు చిన్నతనం నుంచి ఒకటే కోరిక. అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించి దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందాలని. దీన్నే లక్ష్యంగా చేసుకున్నాను. ఇందుకోసం నాలోని ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకున్నాను. పట్టుదలతో టైటిల్ సాధించాను. కేవలం చదువుల్లో రాణిస్తే సరిపోదు. అన్నింటా ప్రతిభ కలిగి ఉండాలి. నలుగురిలో కలిసిపోయే తత్వం, సమయానికి స్పందించే తీరు, సామాజిక సేవ, ఇతర అభిరుచులపై పట్టు.. ఇలా అన్నీ కలగలిసి ఉన్నవారే ముందుకు దూసుకుపోగలుగుతారు.. అని ప్రణతి అంటోంది. సామర్థ్యానికి పదును పెట్టే అనేక సవాళ్లను అధిగమిస్తూనే మన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెబుతోంది. మంచి అవకాశాలొస్తే హాలివుడ్ సినిమాల్లో నటించాలని ఉందంటోన్న ప్రణతి రెండేళ్ల తర్వాత స్వరాష్ట్రానికి వస్తానంటోంది.