సినిమా అంటే సినిమా అంతే: ఎమ్మెల్సీ మల్లన్న
‘‘చిన్న సినిమా? పెద్ద సినిమా? అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు. సినిమా అంటే సినిమా అంతే. ‘ప్రణయ గోదారి’ టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్, సాంగ్స్ కూడా బాగా నచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా, సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పీఎల్వీ క్రియేషన్స్‌పై పారమళ్ల లింగయ్య నిర్మించారు. ఈ నెల 13న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎమ్మెల్సీ మల్లన్న, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ అతిథులుగా హాజరయ్యారు. పీఎల్ విఘ్నేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం నా ఆస్తులు అమ్మడంతో పాటు అప్పులు తెచ్చాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం సులభం కాదనే విషయం అర్థమైంది’’ అన్నారు. ‘ఓ చిన్న చిత్రం బయటకు రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రారు. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ప్రణయ గోదారి టీంలో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి’అని సోహైల్ అన్నారు.