ట్రిపుల్‌ఐటీని మరింత అభివృద్ధి చేయాలి
నూజివీడు: ట్రిపుల్‌ఐటీని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు అన్నారు. ఆర్జీయూకేటీ ఓఎస్డీ నితిన్‌రెడ్డి శుక్రవారం నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌ను సందర్శించారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావుతో కలసి క్యాంపస్ అంతా కలియతిరిగారు.
ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ క్యాంపస్‌లోని రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు విద్యాపరంగా మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టాలని కోరారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటైతే భవిష్యత్తులో నూజివీడు పట్టణానికి రాష్ట్రంలోనే ప్రాముఖ్యత ఏర్పడుతుందని, మరిన్ని విద్యాసంస్థలు వచ్చే అవకాశం ఉందన్నారు. అకడమిక్ బిల్డింగ్స్, సెంట్రల్‌లైబ్రరీ , సెమినార్ హాల్ తదితర బిల్డింగ్‌లను నిర్మించాలని, అన్ని ఆటలకు అనువుగా క్రీడా మైదానాలను అభివృద్ధిపరచాలన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నూజివీడుకు ఇచ్చిన వరం ట్రిపుల్ఐటీ అని, దీని అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామని చెప్పారు. ట్రిపుల్ఐటీకి కావాల్సిన మరో వంద ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నెలలో ఉత్తర్వులు జారీ చేసిందని, త్వరితగతిన రెవెన్యూ అధికారులు భూమిని సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థలాల కొరత ఎక్కువగా ఉన్నందున ప్రాంగణంలో ఉన్న కొండమీద ఉన్న కూడా పాలనా సంబంధిత భవనాలను నిర్మించుకోవచ్చన్నారు.
నితిన్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రిపుల్ఐటీలోని రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని, జూలై 3న నిర్మాణం ప్రారంభించి రెండునెలల్లో పూర్తిచేస్తామన్నారు. ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్(ఇండియా)లిమిటెడ్ సంస్థకు ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ సెంటర్, గ్రంథాలయ భవన నిర్మాణాలను కూడా చేపడతామని వెల్లడించారు. స్థానిక ఓఎస్డీ జీ రామకృష్ణారెడ్డి, ఈపీఎల్ జనరల్మేనేజర్ టీవీ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు పల్లెర్లమూడి అభినేష్, పల్లె రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.