prattipati Milhouse
-
ఇసుక ధరలను అదుపు చేస్తాం
సాక్షి, గుంటూరు: ఇసుక ధరలను అదుపు చేస్తామని, ఇందులోభాగంగా ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. నూతన ఇసుక విధానం అమలుపై జిల్లా అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 15.49 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అర్బన్, రూరల్ ఎస్పీలు, జేసీ, జిల్లా పంచాయతీ అధికారి, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, డీటీసీలతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ధరల నియంత్రణ, అక్రమ తరలింపులపై ఈ కమిటీ రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తుందన్నారు. రవాణా చార్జీలపై పర్యవేక్షణకు డీటీసీ, అదనపు ఎస్పీ, ఏజేసీలతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అవకతవకల నివారణకు అర్బన్, రూరల్ ఎస్పీల నేతృత్వంలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందన్నా రు. రవాణాలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వమే వాహనాలు కొనుగోలు చేస్తుందన్నారు. రూ.5.34 కోట్ల విలువైన ఇసుక విక్రయం జిల్లాలో ఐదు రీచ్‌ల ద్వారా ఇప్పటివరకు రూ.5.34 కోట్ల విలువైన 2,467 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించినట్లు మంత్రి చెప్పారు. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.650 కే విక్రయించామన్నారు. ఓగేరు, గుండ్లకమ్మ వంటి గుర్తింపు లేని రీచ్‌లలో పంచాయతీ కార్యదర్శుల అనుమతితో ఇసుక కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శి అక్రమాలకు పాల్పడితే తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలపై 18001212020 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, రామకృష్ణ, జేసీ డాక్టర్ శ్రీధర్, డీపీవో వీరయ్య పాల్గొన్నారు. -
పండుగలా టీడీపీ సభ్యత్వ నమోదు
కొరిటెపాడు(గుంటూరు): టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం నుంచి పండుగ వాతావరణంలో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కన్వీనర్‌గా వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్.ఆంజనేయులు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగే అవకాశం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయూల్లో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కష్టపడి పనిచేస్తే పదవులు దక్కుతాయనటానికి తానే ఉదాహరణ అని గుర్తుచేశారు. ఈసారి కేవలం క్రియాశీలక సభ్యత్వం మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఓటర్లలో ఐదు శాతం మందిని క్రియాశీలక సభ్యులుగా చేర్చాలని సూచించారు. నవంబరు చివరినాటికి సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కోరారు. క్రియాశీలక సభ్యులకు రూ. 2 లక్షల బీమా, పాక్షికంగా గాయపడినవారికి రూ. 50 వేల సహాయం ఇస్తామన్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు, ఆర్టీసీలో పది శాతం రాయితీ కల్పిస్తామన్నారు. సభ్యులకు 15 రోజుల్లో గుర్తింపుకార్డులు ఇస్తామన్నారు. జిల్లా కన్వీనర్ జి.వి.ఎస్.ఆంజనేయులు మాట్లాడుతూ అందరి సహకారం, ప్రొత్సాహంతో పార్టీని ముందుకు నడిపిస్తానని తెలిపారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి గుంటూరు జిల్లా నాంది కాబోతోందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ గ్రూపులకతీతంగా పనిచేయాలని ఆంజనేయులుకు సూచించారు. అందరిని కలుపుకొనిపోయి పార్టీని క్షేత్రస్థాయి నుంచి ముందుకుతీసుకెళతారని ఆశిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణకుమార్, అనగాని సత్యప్రసాద్‌లు మాట్లాడుతూ తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు. మాజీ మంత్రి కె.ఆర్.పుష్పరాజ్ మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకీ లేనంతమంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని, సంస్థాగత ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న పార్టీ టీడీపీయేనని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఆంజనేయులుకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దీన్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజా మాస్టారు, గంజి చిరంజీవి, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.