'డబ్బుల కోసం రాహుల్ వేధించాడు'
న్యూఢిల్లీ: హిందీ సీరియల్స్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుని నెల రోజులు గడచినప్పటికీ వివాదాలు సద్దుమణగలేదు. ఈ కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ను పోలీసులు ప్రశ్నించి, అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రత్యూష తల్లిదండ్రులు సోమా, శంకర్ బెనర్జీ, న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.
తమకున్న ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూష మృతికి రాహుల్ సింగే కారణమని, అతడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రాధేయపడ్డారు. అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బుల కోసం తమను రాహుల్ వేధించాడని లేఖలో పేర్కొన్నారు. గత ఆగస్టులో ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడని వెల్లడించారు.