ముందస్తు అడ్మిషన్లపై ఆగ్రహం
- ఆర్ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
- ఆయా కళాశాలలపై చర్యలకు డిమాండ్
అనంతపురం ఎడ్యుకేషన్ : వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని కార్పొరేట్ కళాశాలలు అప్పుడే అడ్మిషన్లు చేస్తున్నాయంటూ ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు దీన్ని నిరసిస్తూ మంగళవారం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయానికి గేటు వేసి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలల వారు ఏకంగా పీఆర్వోలను నియమించి వారిని ఇంటింటికీ పంపి విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
కరువు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులకు లేనిపోని ఆశలు కల్పించి ఫీజుల రూపంలో వారిని దోచుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన పేర్లు పెట్టి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పరుశురాం, మారుతీప్రకాష్, లోకేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు జాన్సన్, మనోహర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు అడ్మిషన్లు చేయకూడదు : ఆర్ఐఓ
ఎవరూ ముందస్తు అడ్మిషన్లు చేయకూడదని, జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ఆర్ఐఓ వెంకటేశులు హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. అడ్మిషన్ దరఖాస్తుకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే వసూలు చేయాలని, ట్యూషన్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో కళాశాల నోటీస్ బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి జూనియర్ కళాశాలకు మంజూరు చేసిన గ్రూపులను మాత్రమే కళాశాల అప్లికేషన్లో ముద్రించాలన్నారు. సెలవు దినాల్లో కళాశాలలు నడపరాదని, ప్రతి తరగతి గదిలోనూ పరిమితికి మించి విద్యార్థులు ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి కళాశాలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు.