ప్రపంచ రికార్డుకోసం 17 నెలల గర్భిణి ....!
చైనాః వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలోనూ, అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించడంలోనూ చైనావాసులు ముందుంటారు. ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ వారికి వారే సాటి. అయితే తాజాగా ఓ మహిళ తాను 17 నెలల గర్భిణినని, ప్రపంచ రికార్డుకు అర్హురాలినంటూ క్లైమ్ చేయడం సంచలనంగా మారింది. సాధారణంగా ఉండే తొమ్మిది నెలల గర్భం.. కొందర్లో అరుదుగా పది నెలలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే 17 నెలలు గర్భంతో ఉన్నానంటూ ఆమె చెప్తున్న వివరాలు నిజమే అయితే.. వరల్డ్ రికార్డు ఆమెను వహించినట్లే...
చైనా హునాన్ ప్రావిన్స్, తియాన్సింగ్ నగరానికి చెందిన వాంగ్ షి అనే మహిళ... బహుశా గిన్నిస్ రికార్డును సాధించే అవకాశం కన్పిస్తోంది. రికార్డుకోసం ప్రత్యేకంగా ఆమె ఏ ప్రయత్నాలు చేయకపోయినా... గత సంవత్సరంలో గర్భం ధరించిన ఆమె.. 17 నెలల పాటు ప్రసవం కాకుండా గర్భిణిగానే ఉండిపోవడం.. దీర్థకాలం గర్భాన్ని ధరించిన మహిళగా రికార్డు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. లెక్క ప్రకారం 2015 నవంబర్ నెలలో వాంగ్ షి కి ప్రసవం కావాల్సి ఉండగా.. డ్యూ డేట్ దాటి ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకు ఆమె.. ఆగస్టు 18న బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా (మాయ) సరిగా పెరగకపోవడంతోనే అంతకాలంపాటు ప్రసవం కానట్లు తెలుస్తోంది.
2015 ఫిబ్రవరి నెలలో గర్భాన్ని ధరించిన వాంగ్ షి.. తొమ్మిది నెలల తర్వాత ప్రసవం కాకపోవడంతో ఆస్పత్రికి వెళ్ళింది. అయితే ఆమె గర్భంలో ప్లాసెంటా ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని, ప్రసవానికి కొంత సమయం పడుతుందని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్లాసెంటా ప్రీవియాగా పిలిచే సమస్యవల్ల ఆమెకు తొమ్మిది నెలలు దాటినా ప్రసవం అయ్యే సూచనలు కనిపించడం లేదని చెప్పారు. డ్యూడేట్ దాటిపోవడంతో ఆందోళనలో పడ్డ వాంగ్ సహా.. ఆమె భర్త.. ప్రతి ఏడునుంచీ పది రోజులకోసారి చెకప్ కోసం ఆస్పత్రికి వెడుతూనే ఉన్నారు. అనంతరం 14 నెలలు గర్భం ఉన్నసమయంలో ఓసారి ప్రసవానికి సిద్ధమైన వాంగ్ ను వైద్యులు వారించారు. ఆమె ఇంకొంతకాలం ప్రసవంకోసం వేచి చూడాల్సి ఉందని, సి-సెక్షన్ ఆపరేషన్ చేయడానికి తగినంతగా 'ఫీటస్' వృద్ధి చెందలేదని తెలిపారు.
ఆగస్టు 18న విజయవంతంగా బిడ్డకు జన్మనిచ్చిన వాంగ్... అంతకు ముందు నెల రోజుల క్రితం తన బాధను మీడియాముందు వ్యక్తపరచింది. ఇంతకాలంపాటు గర్భిణిగా ఉండటం ఎంతో సిగ్గుగా ఉందని, అంతేకాక అధిక నెలలు మోయడంతో కేవలం చెకప్ ల కోసం 1,500 డాలర్ల వరకూ ఖర్చు కూడా అధికంగానే అయ్యిందని వాపోయింది. సాధారణంగా గర్భానికి ముందు 52.2 కిలోల బరువుండే తాను.. 26 కేజీలు పెరిగి 78 కేజీలకు చేరుకున్నానని, ఇక తనకు భరించే శక్తి లేదంటూ ఆందోళన చెందింది. కానీ ఎటువంటి ఇతర సమస్యలు లేకుండా ఆరోగ్యంగానే ఉండటంతో చివరికి ఆగస్టు 18న 3.8 కేజీల బరువున్న ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించింది.
1945 సంవత్సరంలో ఆమెరికాకు చెందిన బ్యూలా హంటర్ అనే మహిళ.. 375 రోజుల సుదీర్ఘ గర్భంతో ఉన్నట్లు ఆధారాలు తెలుపుతున్నాయని, వాంగ్ కు 2015 లో ప్రసవం కావాల్సినట్లు వైద్యులు ఇచ్చిన రికార్డులు ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికెట్ జారీచేస్తే..వాంగ్ షి గత రికార్డును తిరగరాసినట్లేనని పీపుల్స్ డైలీ వెల్లడించింది. అయితే వాంగ్ షి 17 నెలల గర్భంతో ఉన్నట్లు పూర్తిశాతం రికార్డులు లేవని, డ్యూ డేట్ కు ముందు ఆమె ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్నట్లు ఆధారంకోసం పరిశీలిస్తున్నామని చెంగ్ షా కు చెందిన ఓ ఫిజిషియన్ తెలిపారు.