కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం తన కార్యాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల సమక్షంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,93,197 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, 1,92,588 మంది అర్హత పొందారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్‌లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ)లను నిర్వహిస్తారు. ఈ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ పరీక్షలకు రె ండువారాల ముందుగా వెబ్సైట్ నుంచి అనుమతి లేఖలను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
గత నెల 24న జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఆదిలాబాద్ జిల్లా నుంచి 14,437 మంది, హైదరాబాద్ నుంచి 19,312, కరీంనగర్ నుంచి 22,054, ఖమ్మం నుంచి 22,806, మహబూబ్‌నగర్‌జిల్లా నుంచి 20,421,మెదక్‌జిల్లా నుంచి 10,481, నల్లగొండ నుంచి 23,595, నిజామాబాద్ నుంచి 11,271, రంగారెడ్డిజిల్లా నుంచి 22,861, వరంగల్ నుంచి 25,270 మంది అర్హత సాధించారు. ఎక్స్‌సర్వీస్‌మెన్ 292 మంది హాజరుకాగా 138 మంది అర్హత సాధించారు. కాగా, ఓఎంఆర్ షీట్ల వాల్యుయేషన్‌కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు దానిని సవాల్ చేయవచ్చు. గురువారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు www.tslprb.in వెబ్సైట్ నుంచి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకుని తమ వినతులను సమర్పించవచ్చు. రీవాల్యుయేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు (ఎస్సీ, ఎస్టీలకు రూ.2 వేలు) చెల్లించాల్సి ఉంటుందని టీఎస్పీఎల్ఆర్బీ చైర్మన్ జె.పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు.