Prem Kumar Patra
-
అతడే సీఎమ్ అయితే?
ఆ నలుగురు, వినాయకుడు చిత్రాల ద్వారా ఉత్తమాభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రేమ్‌కుమార్ పట్రా. ఆయన సమర్ఫణలో అనిల్ జేసన్ గూడూరు దర్శకత్వంలో సరితా పట్రా నిర్మించిన చిత్రం ‘ఆ ఐదుగురు’. వెంకట్, అస్మితా సూద్, క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్‌రెడ్డి, కృష్ణతేజ, శశి ఇందులో ముఖ్య తారలు. ‘మంత్ర‘ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఆడియో వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, లగడపాటి శ్రీధర్, డీయస్ రావు, శ్రీధర్ రెడ్డి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తన తండ్రి చనిపోవడం వల్ల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, ఈ నెల 20న లేక 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ పట్రా తెలిపారు. ఇందులో ఐపీయస్ అధికారి తోట చక్రవర్తిగా నటించానని, ఈ పాత్ర కోసం రెండు నెలలు పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నానని వెంకట్ చెప్పారు. ఈ కథ ప్రధానంగా ఐదు పాత్రలు చుట్టూ తిరుగుతుందని, ఆదర్శ భావాలున్న ఓ యువకుడు ముఖ్య మంత్రి అయితే ఏం చేస్తాడనేది ముఖ్య అంశమని దర్శకుడు అన్నారు. పాటలు రాయడంతో పాటు ఈ సినిమాకి మాటలు కూడా రాశానని, ఇది ప్రయోజనాత్మక సినిమా అని సుద్దాల అశోక్‌తేజ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్‌కుమార్ పట్రా. -
అప్పుడు ఆ నలుగురు...ఇప్పుడు ఆ అయిదుగురు
ప్రేమ్‌కుమార్ పట్రా.. ఈ పేరు వినగానే ఆ నలుగురు, వినాయకుడు సినిమాలు గుర్తొస్తాయి. ప్రేమ్‌కుమార్ అభిరుచికి ఈ రెండు సినిమాలు దర్పణాలు. ముచ్చటగా మూడోసారి ఆయన సమర్పణలో ‘ఆ అయిదుగురు’ అనే చిత్రం రూపొందింది. ‘అతడే సీఎం’ అనేది ఉపశీర్షిక. తన గత చిత్రాల్లాగే విలువలతో కూడిన కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని ప్రేమ్‌కుమార్ చెప్పారు. సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ చెబుతూ ‘‘పోలీస్ అకాడమీ నుంచి బయటకొచ్చిన అయిదుగురు కుర్రాళ్లు ఏం చేశారు? అనేది ఈ చిత్రం కథాంశం. రాజకీయ నేపథ్యంలో సాగే అర్థవంతమైన సినిమా ఇది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. జనవరి తొలివారంలో పాటల్ని, అదే నెల 26న సినిమాను విడుదల చేస్తాం.’’ అని తెలిపారు. అయిదుగురు యువకుల జీవితమే ఈ సినిమా అని, సుద్దాల అశోక్‌తేజ ఈ చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయం అవుతున్నారని దర్శకుడు అనిల్ జాసన్ గూడూరు తెలిపారు. సమాజానికి యువత ఉపయోగపడే తీరును తెలిపే సినిమా ఇదని నటుడు వెంకట్ చెప్పారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో క్రాంతి, తనిష్క్‌రెడ్డి, క్రాంతికుమార్, కృష్ణతేజ, శశికాంత్, అస్మితాసూద్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, కెమెరా: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: సరిత పట్రా.