బార్లో ‘ప్రేమదేశపు యువరాణి’ ఐటెం సాంగ్!
యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని ‘మసకతడి’ అనే ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ మణికొండలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో యామిన్ మాట్లాడుతూ ‘ఓపెన్ బార్లో ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారినుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించింది. సెలబ్రిటీల సమక్షంలో ఇలాంటి వేడుక చేయడం రొటీన్ మేమిలా వినూత్నంగా ప్లాన్ చేశాం. దర్శకుడి ఐడియాకు ధన్యవాదాలు’ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా సాగే లవ్‌స్టోరీ ఇది. బార్లో పాట విడుదల చేయడం తప్పని అనుకున్నా ఇలా... కొత్తగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయి. అంతా కొత్తవాళ్లం ఓ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు.