అదరగొడుతున్న ఐఫోన్7 మోడల్స్
కోల్కత్తా : యాపిల్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ మోడల్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతున్నాయి. భారత రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ల ముందస్తు బుకింగ్స్ గతేడాది విడుదలైన ఐఫోన్6ఎస్, 6ఎస్ ప్లస్లతో పోలిస్తే 50 శాతానికి పైగా ఎగిశాయని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ వెల్లడించారు.అత్యాధునిక ఫీచర్లతో పాటు, ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్‌కు గెలాక్సీ నోట్7 రూపంలో ఎదురైన ముప్పు, యాపిల్ తాజా ఐఫోన్లకు బాగా కలిసొచ్చిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారికంగా అక్టోబర్ 1 నుంచి ఈ ఆర్డర్లు ప్రారంభమవుతున్నప్పటికీ, ముందస్తు బుకింగ్స్ అదరగొడుతున్నాయని చెబుతున్నాయి.
కాలిఫోర్నియాకు చెందిన ఈ దిగ్గజం భారత్‌లో పెరుగుగున్న డిమాండ్‌కు అనుగుణంగా లాంచ్ ఇన్వెంటరీని ఎక్కువగా విడుదల చేయాలని భావిస్తోంది. జెట్ బ్లాక్ కలర్ ఐఫోన్7 ప్లస్‌కు, 32 జీబీ వేరియంట్ ఐఫోన్7కు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఐఫోన్7 ధర భారత్‌లో రూ.60వేల నుంచి రూ.80వేల మధ్యలో ఉండగా.. ఐఫోన్7 ప్లస్ ధర రూ.72వేల నుంచి రూ.92వేల మధ్యలో ఉన్నాయి.
మరో వైపు యాపిల్ ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్ కంపెనీకి బ్యాటరీ పేలుళ్ల ఘటనతో వచ్చిన చిక్కుతో, గ్లోబల్‌గా తన గెలాక్సీ నోట్7 ఫోన్లను రీకాల్ చేస్తోంది. అయితే శాంసంగ్ తన బ్యాటరీ పేలుళ్ల సమస్యను పరిష్కరించిందని, సెప్టెంబర్ 28-30 తేదీల్లో భారత మార్కెట్లోకి గెలాక్సీ నోట్7 ఫోన్లు పునఃప్రవేశపెడుతుందని పలువురు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 28న దక్షిణ కొరియాలో గెలాక్సీ నోట్ 7 ఫోన్లను మార్కెట్లోకి రీలాంచ్ చేస్తామని శాంసంగ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దక్షిణకొరియాతో పాటు భారత్‌లోనూ ఈ ఫోన్లను రీలాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పండుగ సీజన్లో భారత్‌లో యాపిల్-శాంసంగ్‌లకు పోటీ తీవ్రంగా ఉంటుందని, ఒకవేళ శాంసంగ్ తన ఫోన్లను పునఃప్రవేశపెట్టడం ఆలస్యం చేస్తే ఆ కంపెనీకి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.