వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రీయల్ క్లస్టర్
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్) : వీరపనేనిగూడెం ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా తయారుచేసేందుకు కృషి చేస్తామని అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రావు చెప్పారు. ఏపీ ఐఐసీ విజయవాడ రీజియన్ డెప్యూటీ జనరల్ మేనేజర్ శరత్‌బాబు ఆధ్వర్యంలోని పారిశ్రామికవేత్తల బృందం సోమవారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని కొండపోరంబోక సర్వే నంబర్ 192/7బీ భూములను సందర్శించింది. ఈ సందర్భంగా ఏవీ రావు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాజధానిలో పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించగా, వీరపనేనిగూడేన్ని సూచించారని చెప్పారు. ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఒక్కో పరిశ్రమకు రూ.కోటి నుంచి రూ.5కోట్ల వరకూ పెట్టుబడులు పెడతారన్నారు. డాక్టర్ నన్నపనేని మురళీ మాట్లాడుతూ రాబోయే తరానికి మంచి భవిష్యత్ అందించే లక్ష్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్త వేణుబాబు మాట్లాడుతూ పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న తాము డిప్లొమా, ఐటీఐ వారికి ఉపాధిని అందిస్తామన్నారు. ఏపీఐఐసీ డీజీఎం శరత్‌బాబు మాట్లాడుతూ 86 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆ మేరకు పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెప్పారు.