మాజీ ప్రెసిడెంట్‌కు ఎదురుదెబ్బ
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీకి ఎదురుదెబ్బ తగిలింది. 2017 మే లో జరిగనున్న ఎన్నికల్లో మరోసారి ప్రెసిడెంట్ పదవిపై కన్నేసిన ఆయన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. యాంటీ ఇమ్మిగ్రేషన్ అంశాన్ని నమ్ముకొని ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది.
ప్రైమరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్ ఫల్లాన్ చేతిలో నికొలస్ సర్కోజీ ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం తదుపరి రౌండ్లో తాను ఫిల్లాన్ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటమిపై ఎలాంటి బాధ లేదని ఆయన ప్రకటించారు. రెండో రౌండ్లో మరో మాజీ ప్రధాని అలైన్ జుప్పీతో ఫిల్లాన్ తలపడనున్నారు. వీరిలో విజయం సాధించిన వారు మే లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి మరైన్ లీ పెన్‌తో తలపడే అవకాశం ఉంది.